న‌ల్ల కోడి... కేజీ రూ.900 !

న‌ల్ల కోడి... కేజీ రూ.900 !

కోడి ఎలా ఉంటుందని ఈ కాలం పిల్లల్లో ఎవరిని అడిగినా తెల్లగా ఉంటుందనే చెప్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫారంలలో పెంచే తెల్లకోళ్లే తప్ప నాటుకోళ్లన్నవి పెద్దగా కనిపించడం లేదు. గ్రామాల్లో కూడా బాగా తగ్గిపోయాయి. అయితే... కోడంటే తెల్లగా ఉంటుందనుకునే ఈ తరుణంలో కారు నలుపు కోళ్లు కొన్నాళ్లుగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పైగా సాధారణ కోడి మాంసం ఏడాదిలో ఎప్పుడైనా సరే రూ.200ల్లోపే ఉంటుండగా ఈ కారు నలుపు కోడి మాంసం రూ.750 నుంచి రూ.900 వరకు ధర పలుకుతోంది. అంతేకాదు.. దీని గుడ్డు ధర రూ.35 నుంచి రూ.40 పలుకుతోంది. ఇంతకీ ఈ నల్లకోడి సంగతేంటో చూద్దామా.

హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాలు, పొరుగునే ఉన్న కర్ణాటక, ఆపైన ఉణ్న కేరళలో ఇప్పుడు కడక్‌నాథ్ కోడంటే మాంసాహార ప్రియులు పడిచస్తున్నారు. కోడి ఈకలు, కాలిగోళ్లు, ముక్కు, నాలుక, చర్మం, శరీరంలో ఎముకలు.. పుంజయితే తలపైన ఉండే తురాయి కూడా నల్లగానే ఉండే ఈ కడక్‌నాథ్ కోడికి గిరాకీ ఎక్కువైంది.

వాస్తవానికి ఈ రకం తెలుగు రాష్ట్రాలకు చెందినవి కావు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఈ రకం ఉంటుంది. ఎక్కవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌లలోని ఆదివాసీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే, కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గిపోతుండడంతో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దీని జియో ఐడెంటిఫికేషన్ కోసం కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మధ్య ప్రదేశ్ లోని జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వీటిని పెంచుతుండడమే కాకుండా అక్కడి నుంచి భారీ ఎత్తున గుడ్లు, పిల్లలను సరఫరా చేస్తున్నారు. దీంతో కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కోళ్లం పెంపకం దారులు వచ్చి వీటిని తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో వీటిని పెంచుతున్నారు.

మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌లలో వీటిని స్థానికంగా కాలామాసీ అంటారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ రకం కోళ్లన్నీ కారు నలుపుగానే ఉండవు. ఇందులో మూడు రకాలుంటాయి. మొదటి రకం కారు నలుపు కోడి. ఇంకో రకం గ్రాఫైట్ అంటే పెన్సిల్ ముల్లు రంగులో ఉంటుంది. ఇంకొన్ని బంగారు వర్ణంలో కూడా ఉంటాయి. ఈ రకం కోళ్లలో మెలనిన్ అత్యధిక స్థాయిలో ఉండడం వల్ల కారు నలుపుగా ఉంటాయి. ఈ రకం కోళ్లకు గుడ్లను పొదిగే లక్షణం తక్కువ. ఇతర రకాల కోళ్లతో పొదిగించడం కానీ.. ఇంక్యుబేటర్ల పొదిగించడం కానీ చేయాలి.

అయితే.. కడక్ నాథ్ కోడిమాంసంలో పోషక, ఔషధ విలువలు ఉండడంతో వీటికి గిరాకీ ఏర్పడుతోంది. ముఖ్యంగా కడక్ నాథ్ కోడిలో కొవ్వు పదార్థం బాగా తక్కువగా ఉంటుంది. సాధారణ కోళ్లలో కొవ్వు శాతం 4 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ కడక్ నాథ్ కోళ్లలో 0.1 నుంచి 0.7 శాతం మధ్య మాత్రమే ఉంటుంది. అన్నిటికీ మించి ఈ మాంసం తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న ప్రచారం ఒకటి ఉండడంతో గిరాకీ పెరిగింది.

కోళ్ల పెంపకందారుల వైపు నుంచి చూస్తే తెల్లకోళ్ల మాదిరిగా ఇవి సున్నితమైనవి కాకపోవడం, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలగడం, రోగ నిరోధక శక్తీ ఎక్కువగా ఉండడంతో పెంపకంలో నష్టాలు వచ్చే ప్రమాదం తక్కువ కాబట్టి చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఈ కోడి పూర్తిస్థాయిలో పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇందుకు 6 నెలల సమయం పడుతుంది. అయినా, ధర ఎక్కువ ఉండడంతో అక్కడికి అది సరిపోతుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం వల్ల పెంపకందారులు కూడా మొగ్గు చూపుతున్నారు.

కొన్ని సూక్ష్మపోషకాలు దీని రక్తంలోనూ, మాంసంలోనూ ఉంటాయి. ఉన్నాయి. ఈ మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు. సాధారణ మాంసంతో పోలిస్తే ఈ జాతి కోళ్ళ మాంసంలో అధిక మాంసకృత్తులు, లినోలెనిక్ ఆమూలు, తక్కువ కొవ్వు పదార్ధాలు ఉన్నాయని.. పురుషుల్లో నరాల బలహీనతకు, వంధ్యత్వ నిరోధానికి, లైంగిక పటుత్వానికి పనిచేస్తుందని చెప్తున్నారు. బి1 బి2, బి6, బి12తో పాటు సి, ఈ విటమిను అధికంగా ఉంటాయి. క్షయ, ఆస్తమా రోగులకు మంచిదని చెప్తారు.

అయితే.... హైదరాబాద్ వంటి చోట్ల కడక్ నాథ్ చికెన్ కేజీ రూ.900 పలుకుతుండగా పశ్చిమగోదావరి జిల్లాలో పెంపకం దారుల వద్ద దీని ధర అందుబాటులోనే ఉంది. అక్కడ వారు లైవ్ కడక్ నాథ్ సైజును బట్టి రూ.450 నుంచి రూ.550 ధరకు అమ్ముతున్నారు. మాంసంగా చేస్తే కేజీ రూ.250 నుంచి రూ.280కి విక్రయిస్తున్నారు. అలాగే గుడ్లు రూ.8కి విక్రయిస్తున్నారు. కానీ.. గిరాకీ సృష్టించి నగరాల్లో వీటి ధర భారీగా పెంచేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు