పవన్ కళ్యాణ్ ఏం సంకేతాలిస్తున్నట్లు?

పవన్ కళ్యాణ్ ఏం సంకేతాలిస్తున్నట్లు?

పవన్ కళ్యాణ్‌కు మంచి ఉద్దేశాలుండొచ్చు. రాజకీయాల్లోకి అతను గొప్ప లక్ష్యాలతోనే వచ్చి ఉండొచ్చు. కానీ తన రాజకీయ ప్రయాణంపై అతడికి స్పష్టత ఉందా అన్నది వ్యతిరేకులు అడిగే మాట. రాజకీయాల్లో మార్పు రావాలంటాడు. అందుకోసమే తాను వచ్చానంటాడు. కానీ అధికారంలో ఉన్న వాళ్లను పొగుడుతాడు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయం జనాలది. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడానికి తయారవుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోఅధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరించడం పట్ల పవన్ మీద చాలా విమ్శలున్నాయి. ఆ పార్టీ నుంచి ప్రయోజనం పొంది.. వారిని ఇబ్బంది పెట్టకుండా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.

ఆ సంగతలా ఉంచితే.. ఒక కొత్త పార్టీ పెట్టి దాని అధినేతగా ఉంటున్నపుడు తాను కలిసే వ్యక్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న ఆలోచన పవన్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం, పొగడటం పవన్‌ ఇమేజ్‌ను ఎంత డ్యామేజ్ చేసిందో.. ఎన్ని విమర్శలు తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో యాత్రకు సిద్ధమవుతూ.. ఆ జిల్లా మంత్రి పరిటాల సునీతను పవన్‌ కలవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీని నిర్మించేందుకు జిల్లాలో యాత్ర చేయబోతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకురాలైన సునీతను కలవడమేంటన్నది ప్రశ్న. దీని ద్వారా పవన్ ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇక పవన్ సొంతంగా పార్టీ ఎందుకు పెట్టినట్లు? ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. అవసరమైతే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ కూడా చేయొచ్చు. కానీ ముందు తన పార్టీ ప్రత్యేకతను చాటుకోవాలి కదా? తన పార్టీ నిర్మాణం జరగాలి కదా? ఒకవైపు జనసేన యాత్ర అంటూ.. అది మొదలయ్యే ముందు తెలుగుదేశం నేతను కలిస్తే.. ఇక సొంతంగా కార్యకర్తలు ఎలా తయారవుతారు? పవన్ పట్ల కొత్త తటస్థులు ఎలా ఆకర్షితులవుతారు? ఇంత చిన్న లాజిక్ కూడా పవన్‌కు తెలియదా? కనీసం చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆయనకు సరైన సలహాలివ్వట్లేదా? ఇలాంటి వాటిని నియంత్రించట్లేదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు