చంద్రబాబుకు పురంధేశ్వరి ఓపెన్ ఆఫర్..

చంద్రబాబుకు పురంధేశ్వరి ఓపెన్ ఆఫర్..

బీజేపీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాకను రగిలిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి స్పందిస్తూ అంతేస్థాయిలో స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. తమతో కలిసి ఉంటారో, విడిపోతారో తేల్చుకోవాల్సింది టీడీపీయేనంటూ ఆమె గట్టిగా బదులిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉంటే ఉండు, పోతే పో అన్నట్లుగా మాట్లాడారు.

తాము ఇప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని... విడిపోవాలని బీజేపీ భావిస్తే నమస్కారం పెట్టేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె... మిత్రధర్మం పాటించలేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని ఆమె అన్నారు.  చంద్రబాబు చేసిన వ్యాఖ్యల సంగతి బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆమె అన్నారు. బీజేపీతో కలసి ఉండాలని టీడీపీ అనుకుంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుతో ఆ విషయం మాట్లాడాలని అన్నారు.

పొత్తుల పరిస్థితులపై తేడా కొడుతుండడంతో పనిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వం తీరుతెన్నులపైనా పురంధేశ్వరి మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి సొంత పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని ఆమె ఆరోపించారు. పంచాయతీలకు కూడా కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతున్నాయని చెబుతూ.. గ్రామీణాభివృద్ధి కూడా మోదీ పుణ్యమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నట్లుగా దెప్పిపొడిచారు. పనిలోపనిగా ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులు ఇవ్వడంపైనా ఆమె విమర్శలు చేశారు. రాజీనామాలు చేశాకే టీడీపీలోకి రావాలని పార్టీ నేతలను దివంగత ఎన్టీఆర్ కోరేవారని.. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ఫిరాయింపుల విషయంలో అమిత్ షాకు కూడా లేఖరాసి తెలిపామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు