‘ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేయండి’

‘ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేయండి’

నల్లొండ మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ హత్య వివాదం ముదురుతోంది. హతుడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్య అనుచరుడు కావడంతో ఆయన ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఆయన కేసు పరిశోధనలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన హత్యకు కారణం టీఆరెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అని ఆరోపిస్తూ అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అంతేకాదు.. గ్యాంగ్ స్టర్ నయీం కంటే కూడా వీరేశం ప్రమాదకరమైన వ్యక్తని.. నయీంను ఎన్ కౌంటర్ చేసినట్లు ఎమ్మెల్యే వీరేశంను ఎన్ కౌంటర్ చేయాలని కోమటిరెడ్డి అన్నారు.

'వీరేశం అనే వాడు బడా నయీం. ఆ నయీంను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు ఈ వీరేశంను ఎందుకు ఎన్‌ కౌంటర్‌ చేయరు. అవసరం అయితే నా ఫోన్‌ కాల్‌ డేటా తీసుకోవాలి. వీరేశం కాల్‌ డేటా, వీరేశం కిరాయి హంతకుల కాల్‌ డేటా తీసుకుంటే హంతకులు ఎవరో? ఎవరు హత్య చేయించారో అనే విషయం తేలిపోతుంది. వేముల విరేశం వల్లే శ్రీనివాస్‌ హత్య జరిగింది. సీఎం, మంత్రి జగదీష్ రెడ్డి అండ చూసుకొని వీరేశం బెదిరింపు కాల్స్‌ చేయిస్తున్నారు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.  సీఎం మా సహనాన్ని పరక్షించవద్దు' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌ను హత్య చేయించింది ముమ్మాటికి ఎమ్మెల్యే వీరేశమేనని, ఆయన కాల్‌ డేటా, ఆయన కిరాయి హంతకుల కాల్‌ డేటా చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని అన్నారు. హంతకులు హత్య చేసి నేరుగా నకిరేకల్‌ వెళ్లి ఆగినట్లు స్వయంగా డీజీపీ కూడా చెప్పారని, వీరేశం చెబితేనే తాము హత్య చేసినట్లు నిందితులు కూడా ఇప్పటికే డీజీపీ వద్ద ఒప్పుకున్నారని ఆయన అంటున్నారు.

గత మూడేళ్లుగా శ్రీనివాస్‌ హత్యకు కుట్ర జరుగుతోందని.. శ్రీనివాస్ ను చంపించడానికి వీరేశం కోట్లు ఖర్చు చేశాడని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్‌కు అపాయం ఉందని గతంలోనే భార్యభర్తలను అసెంబ్లీ చాంబర్‌కు తీసుకెళ్లి ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నంత పనిచేసినా ఆయన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీ మారాలని శ్రీనివాస్‌పై ఒత్తిడి తెస్తున్నారని,  అయినా అతడు వినకపోవడంతోనే ఈ హత్య చేయించారని అన్నారు. శ్రీనివాస్‌ తనకు కుటుంబ సభ్యుడిలాంటివాడని, 25 ఏళ్లుగా తనతోనే ఉన్నాడని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు