ప‌వ‌న్ అనూహ్య నిర్ణ‌యం.. రిలీజ్ కానున్న షెడ్యూల్‌!

ప‌వ‌న్ అనూహ్య నిర్ణ‌యం.. రిలీజ్ కానున్న షెడ్యూల్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పీడ్ పెంచారు. గ్యాప్ మీద గ్యాప్ తీసుకుంటూ.. అప్పుడ‌ప్ప‌డు రాజ‌కీయాలు చేస్తార‌న్న అప‌ప్ర‌ద మూట క‌ట్టుకున్న ఆయ‌న‌.. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల్ని క‌లిసి వారితో స‌మావేశ‌మ‌య్యారు.

ప‌వ‌న్ తెలంగాణ యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తి మాట‌పైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ తో స‌హా తెలంగాణ విప‌క్షాలు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు సంధించాయి. తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ఎస్ స‌ర్కారును మెచ్చుకోవ‌టంతో పాటు.. కేసీఆర్ పాల‌న‌ను పొగిడిన వైనం విప‌క్షాల‌కు మంట పుట్టేలా చేశాయి. తెలంగాణ‌రాజ‌కీయ వ‌ర్గాల్లో సంద‌డి చేసిన ప‌వ‌న్‌.. హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు.

ఎప్ప‌టి మాదిరే మ‌ళ్లీ రెండు నెల‌ల పాటు చ‌ప్పుడు చేయ‌ర‌న్న భావ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. వారి ఊహ‌ల్ని త‌ల‌కిందులు చేస్తూ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. వెనువెంట‌నే రాయ‌ల‌సీమ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ను షురూ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అది కూడా.. అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తార‌ని చెబుతున్నారు.
ముంద‌స్తుగా త‌న షెడ్యూల్ ప్ర‌క‌టించ‌టం.. అందుకు ఏర్పాట్లు చేయ‌టంలా కాకుండా.. మెరుపు వేగంతో నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన వెంట‌నే ప‌ర్య‌ట‌న ఉండేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ప‌వ‌న్ టూర్ షెడ్యూల్ వెల్ల‌డైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని చెబుతున్నారు. దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంద‌ని చెబుతున్నారు.
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అనంత‌పురం.. క‌ర్నూలు జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఉండే అవ‌కాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ ఇప్ప‌టికే పూర్తి అయిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో మాదిరి గ్యాప్ తీసుకోకుండా.. త‌ర‌చూ టూర్ల మీద టూర్లు ఇక‌పై ప‌వ‌న్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. పార్ట్ టైం రాజ‌కీయాల నుంచి ఫుల్ టైంకు ప‌వ‌న్ షిఫ్ట్ అయిన‌ట్లుగా చెప్ప‌క‌తప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు