మ‌నోళ్ల‌కు ట్రంప్ అనూహ్య తీపిక‌బురు చెప్పారే

మ‌నోళ్ల‌కు ట్రంప్ అనూహ్య తీపిక‌బురు చెప్పారే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి వ‌ల‌స‌వాదుల విష‌యంలో సానుకూలంగా స్పందించారు. ఇంకా చెప్పాలంటే భార‌త‌దేశానికి తీపిక‌బురు అందించారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చిన వారి (డ్రీమర్ల) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ 10 నుంచి 12 ఏళ్ల‌లో వారికి పౌరసత్వం ఇచ్చేవిధంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా వేల మంది భారత సంతతికి చెందిన వలస ప్రజలకు ఊరట లభించనుండ‌టం గ‌మ‌నార్హం.

దాదాపు 6.90 లక్షల మంది చిన్నారులు ఎటువంటి పత్రాలు లేకుండా తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వలస వచ్చారు. వీరిలో అధికశాతం మంది భారత సంతతికి చెందిన వారే ఉన్నారు. నిర్దిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో వీరందరికీ పౌరసత్వం కల్పించేందుకు మొదటిసారి 2001లో డ్రీమ్ బిల్లును తీసుకొచ్చారు. కానీ బిల్లు ఆమోదం పొందలేదు. ఇటీవ‌ల ట్రంప్ దీనిపై క‌త్తిగ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్రంప్ స్పందించారు. `డ్రీమ్ బిల్లులో మేం కొన్ని మార్పులు చేస్తాం. ఇది భవిష్యత్తులో ఏదోఒక సమయంలో తప్పకుండా జరుగుతుంది. ఇందుకు 10 నుంచి 12 ఏళ్లు పట్టవచ్చు` అని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు వెళ్లే ముందు శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని డ్రీమర్లకు ప్రోత్సాహకంగా అభివర్ణించిన ఆయన.. వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

కాగా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. డ్రీమర్ల అంశంపై ఫిబ్రవరి 6వ తేదీ నాటికి ఒక నిర్ణయానికి వద్దామని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రతిపక్ష డెమాక్రటిక్ పార్టీ సభ్యులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకే ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా స్వల్పకాలిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి డెమోక్రాట్లు ఆమోదం తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు