వీహెచ్ తిట్టకుండా బిస్కెట్ వేసిన పవన్

వీహెచ్ తిట్టకుండా బిస్కెట్ వేసిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన మంచి ఎంటర్టైన్మెంట్‌గా మారింది. మొట్టమొదటి రోజే ఆయన పర్యటన కేసీఆర్ కోసమని జనాలకు అర్థం కాగా రెండో రోజు అది మరింతగా స్పష్టమైపోయింది. కేసీఆర్‌ను తెగ పొగడడమే కాకుండా ఆ క్రమంలో ఇతర పార్టీల నేతలు తనను తిట్టకుండా కూడా ఆయన జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు బిస్కెట్ వేశారని అంటున్నారు.

‘వీహెచ్ తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. వీహెచ్..మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం..ప్రజాసమస్యలను తెలుసుకుందాం’ అని పవన్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. కాగా, పవన్ కల్యాణ్ పై వీహెచ్ ‘‘అది జనసేన కాదు, భజనసేన’ అని రీసెంటుగా విమర్శలు చేయడంతో పవన్ ఇలా జాగ్రత్తపడ్డారని అంటున్నారు.

కాగా... పవన్ వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. ‘మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నానని.. అంచెలంచెలుగా పైకి వచ్చానని పవన్ వ్యాఖ్యల అర్థం అయి ఉండొచ్చని.. తాను సీఎం కావాలనుకోవడం పవన్ అభిమానమని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుంది. పవన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళతారు. నేను పవన్ తో పాటు వెళ్లడం కాదు.. పవన్ నాతో కలిసి వస్తానంటే కనుక పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా. పవన్ కల్యాణ్ లో ఇంకా మార్పు రావాలి. పవన్ నాపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గుర్తించాలి. పవన్ పై నేను చేసే విమర్శలు ఆయన చేసే కామెంట్ మేరకు ఉంటాయి’ అని వీహెచ్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు