తెలంగాణ తెలుగుదేశం... ర‌గులుతున్న ప‌ర్వ‌తం!

తెలంగాణ తెలుగుదేశం... ర‌గులుతున్న ప‌ర్వ‌తం!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఆత్మర‌క్షణ‌లో పడేసిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై తెలుగుదేశం పార్టీ పెద్దలు సీరియ‌స్‌గా ఉన్నట్లు స‌మాచారం.  టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లి పార్టీ క్రమ‌శిక్షణ ఉల్లంఘించార‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన టీ-టీడీపీ నేత‌లు జ‌రిగిన ప‌రిణామాల‌పై పూర్తి  సమాచారాన్ని అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక ద్వారా అందించారు. రాజ‌కీయంగా దూమారం రేపిన విలీనం వ్యాఖ్యల‌పై పార్టీ నేత‌లు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.కి షోకాజ్‌ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. మ‌రోవైపు మోత్కుప‌ల్లిని పార్టీలో చేర్చుకునే విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ ఎటూ తేల్చుకోలేక‌పోతుందంటున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం అనంత‌రం ఇప్పటికే  భారీ ఎత్తున నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళ్లడంతో... ఉన్న కొద్ది మంది నేత‌ల మ‌నో స్థైర్యం దెబ్బతీసేలా ఆయ‌న వ్యాఖ్యలు ఉన్నాయ‌న్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమయ్యింది. ఈ ప‌రిణామాల‌పై పార్టీ నేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించడంతో పాటు అమ‌రావ‌తి నుంచి వ‌చ్చే ఆదేశాల‌ను పాటించాల‌న్న నిర్ణయానికి వ‌చ్చారు. పార్టీ పోలిట్‌ బ్యూరో స‌మావేశంలోనే మోత్కుప‌ల్లిని  వివ‌రణ కోరాల‌ని నిర్ణయం తీసుకున్నా.. వ్యక్తిగ‌త కార‌ణాల‌తో మోత్కుప‌ల్లి స‌మావేశానికి హాజ‌రు కాలేదు. దీంతో ఆయ‌న వ్యవ‌హారం పార్టీలో మ‌రింత చ‌ర్చనీయంశంగా మారింది.

క్రమ‌శిక్షణ‌కు మారు పేరుగా ఉండే పార్టీలో క్రమ‌శిక్షణను ఉల్లంఘిస్తే స‌హించేది లేద‌ని టీ-టీడీపీ అధ్యక్షులు ర‌మ‌ణ హెచ్చరించారు. పార్టీ నేతలు అభద్రతకు లోను కాకుడదని.. పార్టీకి చంద్రబాబు అండదండలు ఉన్నాయని అన్నారు. విలీనం వ్యాఖ్యల‌ను మెత్కుప‌ల్లి ఉప‌సంహ‌రించుకోక పోతే చ‌ర్యలు తప్పవ‌న్న సంకేతాల‌ను టీ- టీడీపీ నేత‌లు ఇస్తున్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చర్యలు తీసుకోవాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ ఇచ్చే షోకాజ్‌ నోటీసుకు మోత్కుప‌ల్లి స్పందిస్తారా లేదంటే.. పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తారా అని ఉత్కంఠ  రేగుతోంది. అయితే టీఆర్ఎస్ నుంచి ఉన్న అస్ప‌స్ట‌త కార‌ణంగానే మోత్కుప‌ల్లి బ‌య‌ట‌ప‌డ‌టం లేద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు