ఎంపీ అసదుద్దీన్‌పైకి చెప్పులు!

ఎంపీ అసదుద్దీన్‌పైకి చెప్పులు!

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది.  త్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై చెప్పు విసిరారు. ముంబైలోని నాగ్‌పడా ప్రాంతంలో మంగళవారం ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. షరియత్ చట్టం పరిరక్షణ అంటూ దేశవ్యాప్తంగా అసద్ ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగానే ముంబైలో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

అయితే షూ విసిరినా కూడా అసద్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇలాంటి పనులతో తన గొంతు నొక్కలేరని అసద్ అన్నారు. `సత్య మార్గంలో వెళ్తున్నపుడు కొందరు ఇలాగే దారిలో ముళ్లు వేస్తుంటారు. ఇలాంటివి నాపై ప్రభావం చూపవు. కార్యక్రమం విజయవంతమైంది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నాతో విసుగు చెందిన వ్యక్తులు ఎవరో చేసిన పని ఇది. నేను ఇలాగే ఎలాంటి భద్రత లేకుండా తిరుగుతాను. ఏం చేసుకుంటారో చేసుకోండి` అంటూ అసద్ వ్యాఖ్యానించారు.

ద్వేషాన్ని పెంచి పోషించే వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసద్ చెప్పారు. గాంధీని, దబోల్కర్‌ను, పన్సారేను చంపింది వీళ్లే అంటూ అసద్ విమర్శించారు. ఈ ఘటనపై జోన్ 3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర మిశ్రా స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English