బాబుకు గుడి..ప‌దికిలోల వెండి విగ్ర‌హం కూడా!

బాబుకు గుడి..ప‌దికిలోల వెండి విగ్ర‌హం కూడా!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ద‌క్కిన ప్ర‌త్యేక గుర్తింపు ఇది. ఆయ‌నకు గుడి కట్టించేందుకు పైగా ప్ర‌త్యేకంగా వెండి విగ్ర‌హం పెట్టేందుకు సిద్ధమ‌య్యారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుడి కట్టి కృతజ్ఞత చాటుకునేందుకు హిజ్రాలు సిద్దమయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నుంచి మహానందికి వెళ్లే మార్గంలో గుడి కట్టేందుకు అవసరమైన స్థలం, చంద్రబాబు వెండి విగ్రహాన్ని సిద్ధం చేశారు. త్వరలో గుడి నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు.

అటు స్త్రీ, ఇటు పురుషులు కాకుండా మూడవ వర్గంగా ఉన్న హిజ్రాలు సమాజంలో గుర్తింపునకు నోచుకోక, వెలివేసినట్లు సమాజానికి దూరంగా ఉంటూ హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి వంటి అవకాశాలు లేకపోవడంతో భిక్షాటనను వృత్తిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల హిజ్రాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. వారి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుచేసి నివేదిక తెప్పించుకున్నారు. అనంతరం హిజ్రాలకు ప్రతి నెల రూ.1500 పెన్షన్, పక్కాగృహం, వ్యాపారం చేయగల శక్తి ఉన్న వారికి సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాబు ఆదేశంతో కర్నూలు జిల్లాలో సుమారు 4 వేల మంది హిజ్రాలకు లబ్ది చేకూరుతోంది.

దీంతో చంద్రబాబు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆయనకు ఆలయం కట్టించాలని నంద్యాల ప్రాంత హిజ్రాలు నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత జాతీయ సమత హిజ్రాల హక్కుల ఐక్య పోరాట సమితి వ్యవస్థాపకులు, అడ్వైజర్ విజయకుమార్ మాట్లాడుతూ నంద్యాల టీడీపీ నేత అభిరుచి మధు పది కిలోల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. విజయ మాట్లాడుతూ దశాబ్దాల పోరుకు న్యాయం జరిగిందని, సీఎం స్పందించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించడం హర్షనీయమన్నారు. తమవర్గం బాగోగులు పట్టించుకున్న ఆయన తమ పాలిట దేవుడేనని ఆమె అభివర్ణించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు