తెలంగాణ‌లో పునర్జ‌న్మః ప‌వ‌న్‌

తెలంగాణ‌లో పునర్జ‌న్మః ప‌వ‌న్‌

ఆంధ్ర జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. త‌నకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలంగాణ నేల తల్లికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై పవన్ ప్రసంగించారు. తెలంగాణ ఆశయాల కోసం జనసేన పార్టీ నిలబడుతుందని పవన్ అన్నారు. జై తెలంగాణ నినాదం అణువణువునా పులకరిస్తుందన్నారు.

`నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు. తెలంగాణ అంటే తనకు చాలా ప్రేమ. ఇష్టం. తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని గౌరవిస్తాను` అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కవులు, కళాకారులు అంటే తనకెంతో ఇష్టమన్నారు. మతాల్లేని దేశం కావాలన్నారు. అగ్ర కులాలతో పాటు బడుగు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. భాషను, యాసను గౌరవించే సంప్రదాయం రావాలన్నారు. బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ పండుగలు తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనవి అని చెప్పారు. సంస్కృతులను కాపాడే సమాజం కోసం జనసేన పని చేస్తుందన్నారు. ప్రాంతీయ భావంలో పడి జాతీయవాదాన్ని విస్మరించకూడదని పవన్ సూచించారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్మార్ట్ సీఎంగా పని చేస్తున్నారని తాను నిన్న వ్యాఖ్యానిస్తే.. వాటిని కొందరు తప్పుబట్టారని ప‌వ‌న్ పేర్కొంటూ...కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి.. కొంతమంది నాయకులకు ఇబ్బంది కలిగిందని పవన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు నా విన్నపం ఏంటంటే.. తెలంగాణ పసిబిడ్డను అందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. తెలుగు రాష్ర్టాల్లో నిబద్ధత, విజ్ఞతతో కూడిన రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మాట ఇచ్చాను అంటే.. నిలబడి తీరుతాను. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. జనసేన పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేయనని స్పష్టం చేశారు. ఒక వేళ విలీనం చేసే ఉద్దేశం ఉంటే మీ ముందుకు ఎందుకు వస్తానని కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రణాళికను మార్చి 14లోపు ప్రకటిస్తామని తెలిపారు.

రాజకీయాల్లో తనకెవరితోనూ శత్రుత్వం లేదు. విధివిధానాలపైనే తన పోరాటం కొనసాగుతుందన్నారు. విమర్శించే వారిని పట్టించుకునే సమయం కూడా తనకు లేదన్నారు పవన్. బంగారు తెలంగాణ భవిష్యత్ కోసం పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English