వందేమాత‌రానికి ఉన్నంత శ‌క్తి..జైతెలంగాణ‌కు ఉంది

వందేమాత‌రానికి ఉన్నంత శ‌క్తి..జైతెలంగాణ‌కు ఉంది

జనసేన పార్టీ అధినేత, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్  తెలంగాణలో రెండో రోజు చలో రే చల్‌ యాత్రలో భాగంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కరీంనగర్‌లోని శుభం గార్డెన్‌లో పవన్‌ ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో పవన్ మాట్లాడుతూ తెలంగాణకు తాను చివరి శ్వాస వరకూ రుణపడి ఉంటానన్నారు. ఈ సంద‌ర్భంగా జై తెలంగాణ నినాదం చేశారు.

వందేమాతరం పదానికి ఉన్నంత శక్తి జై తెలంగాణకు ఉందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మనిచ్చారని పవన్ అన్నారు. పునర్‌ జన్మ ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తోందని.. అది కూడా కరీంనగర్ నుంచి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప‌వ‌న్ ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని సమాజం, అవినీతి,అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మార్చి 14లోపు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

తనకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత ద్వేషాలు లేవని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ విధానాల పరంగానే తానెవరితోనైనా విభేదిస్తానన్నారు. రాజకీయాలలోకి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నానని చెప్పారు. తన జీవితంలో ఎక్కువ భాగం తెలంగాణతోనే పెనవేసుకుని ఉందన్నారు. తన సినిమాలలో తెలంగాణ భాష, యాస, సంస్కృతికి అధిక ప్రాధాన్యత నిచ్చానని పవన్ చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తాను రాలేదన్న జనసేనాని ..సమాజంలోనికి అవినీతి ప్రవేశించకుండా అడ్డుకోవడమే లక్ష్యమన్నారు. ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం కాకుండా పాతికేళ్ల సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు