అన్నచేసిన ఆ త‌ప్ప త‌మ్ముడు అస్స‌లు చేయ‌డా?

అన్నచేసిన ఆ త‌ప్ప త‌మ్ముడు అస్స‌లు చేయ‌డా?

రాజ‌కీయ పార్టీ పెట్ట‌టం అంత తేలికైన విష‌యం కాదు. దానికి చాలానే క‌స‌ర‌త్తు అవ‌స‌రం. అంతుకు మించి భారీగా నిధులుకావాలి.  మంది మార్బ‌లంతోపాటు.. స‌మ‌యానికి త‌గ్గ‌ట్లుగా వ్యూహాలు అమ‌లు చేయ‌టం చాలా అవ‌స‌రం. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇలాంటి ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ పై బాగానే అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పాలి. త‌న అన్న పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలో ఎలాంటి త‌ప్పులు జ‌రిగాయో.. అలాంటివేమీ తాను పెట్టిన పార్టీలో జ‌ర‌గ‌కూడ‌ద‌న్న భావ‌న ప‌వ‌న్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

ఆ మ‌ధ్య‌న ఏపీ టూర్ చేసిన స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ని ప‌వ‌న్‌.. తాజాగా తాను నిర్వ‌హిస్తున్న తెలంగాణ టూర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను తెగ పొగిడేస్తున్నారు. కేసీఆర్‌కు క‌ష్ట‌ప‌డే త‌త్త్వం ఎక్కువ‌ని.. ఆయ‌న స్మార్ట్ ముఖ్య‌మంత్రిగా అభివ‌ర్ణించ‌టం విశేషం.

ఇదే కేసీఆర్‌ను సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో తాట తీస్తాన‌న్న తీవ్ర వ్యాఖ్య చేసిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా అందుకు భిన్నంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ సంద‌ర్భంగా తాను ముఖ్య‌మంత్రిని క‌లిసి గ్రీటింగ్స్ చెప్ప‌టం త‌ప్పేం కాద‌న్న ప‌వ‌న్‌.. తెలంగాణ ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌క‌పోతే.. స‌ర్కారు దృష్టికి తీసుకెళ్లి వాటి ప‌రిష్కారం కోసం కృషి చేస్తామ‌న్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని చెప్పిన ప‌వ‌న్‌.. తాను ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే విష‌యంపై ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు క్లారిటీ ఇస్తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. త‌మ‌కు ఎన్ని స్థానాల్లో బ‌లం ఉంటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ.. ఒక‌దాంతో మ‌రొక‌టి సంబంధం లేని రీతిలో వ్యాఖ్య‌లు చేయ‌టం విశేషం.  తాను ఎవ‌రి మ‌ద్ద‌తు కోర‌టం లేద‌న్న ఆయ‌న‌.. త‌న అన్న చిరు మ‌ద్ద‌తు తీసుకునేది లేద‌ని క్లియ‌ర్ చేశారు. నిజ‌మే.. త‌న‌కు తానే అధికార‌ప‌క్షాల‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధ‌మ‌వుతున్న ప‌వ‌న్ కు.. ఎవ‌రి మ‌ద్ద‌తో కోరాల్సిన అవ‌స‌రం లేదు క‌దా?
ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ తాజా ప్లానింగ్ చూస్తే.. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి చిరు ఎలాంటి త‌ప్పులు చేశారో.. అవేమీ రిపీట్ కాకూడ‌ద‌న్న‌ట్లుగా ప‌వ‌న్ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ పెట్టిన వెంట‌నే అధికారాన్ని సొంతం చేసుకోవాల‌నుకోవ‌టంతో భారీ త‌ప్పు అవుతుంద‌ని.. అధికారం కోసం.. ప‌ద‌వుల కోసం ప‌రుగులు పెట్టొద్ద‌న్న వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడు రాజ‌కీయ ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌ప‌క్షానికి అనువుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పాల‌న‌లో పాలు పంచుకోవ‌టం.. అనుభ‌వాన్ని సంపాదించ‌టంపైనే దృష్టి పెట్ట‌టం త‌ప్ప‌.. ప‌ద‌వుల కోసం ప్రాకులాడిన భావ‌న ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అధికార‌ప‌క్షాల‌తో సున్నం పెట్టుకునే సాహ‌సం ప‌వ‌న్ చేయ‌ర‌ని.. తొంద‌ర‌ప‌డి పార్టీని ముంచేసే క‌న్నా.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపి.. త‌న అవ‌స‌రాలన్ని అంత‌కంత‌కూ పెంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

అందుకేనేమో అధికార‌ప‌క్షంపై భ‌జ‌న చేసే కార్య‌క్ర‌మాన్ని షురూ చేసిన‌ట్లుగా ఉంది. ఏపీ ముఖ్య‌మంత్రి అనుభ‌వంపై ఫిదా అయిన‌ట్లుగా మాట‌లు చెప్పే ప‌వ‌న్‌.. తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తొలి మీడియా స‌మావేశంలోనే కేసీఆర్ ను పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ ఇవ్వ‌టం ద్వారా.. అధికార‌ప‌క్షానికి మిత్రుడినేన‌న్న సందేశాన్ని ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మైంది.

దీనికి త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ తెలంగాణ టూర్ పై అధికార టీఆర్ఎస్ నేత‌లు మౌనంగాఉండిపోతే.. తెలంగాణ విప‌క్షాలైన  కాంగ్రెస్.. బీజేపీ నేత‌లు మాత్రం ప‌వ‌న్ పై నిప్పుల్లాంటి విమ‌ర్శ‌ల్ని సంధించారు.చూస్తుంటే రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల అధికార‌ప‌క్షాల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురుస్తుంద‌న్న ఆభిప్రాయం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. పొలిటిక‌ల్ పార్టీ పెట్టి అన్న ఏం త‌ప్పు చేశాడో.. స‌రిగ్గా అదే త‌ప్పు త‌న విష‌యంలో జ‌ర‌గ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు