పవన్‌కు గతి లేదు.. ప్రకాశ్ రాజ్‌కు మతి లేదు

పవన్‌కు గతి లేదు.. ప్రకాశ్ రాజ్‌కు మతి లేదు

కొన్నాళ్లుగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్, అలాగే... టీడీపీ కోసం కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై తెలంగాణ బీజేపీ నేత కృష్ణసాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతకాలం కేసీఆర్‌పై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు సడెన్‌గా ప్రశంసలు మొదలుపెట్టారెందుకంటూ ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమం, విభజన సమయంలో ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై పవన్ అనేక వ్యాఖ్యలు చేశారని క‌ృష్ణసాగర్ గుర్తు చేశారు. కేసీఆర్‌ను పవన్ పొగడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పవన్ తెరాస బీ టీం అని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి తెరాస పవన్ ను ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్‌ను పొగుడుతున్నారంటే పవన్ పార్టీ ప్యాకేజీల పార్టీ అని అర్థమవుతోందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీలో తినడం రాజకీయం కాదన్నారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే జరిగాయని.. పవన్ దీనిపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. పవన్ నినాదంలో అర్థంలేదు... ఆయన యాత్రకు లక్ష్యం లేదని ఏకిపడేశారు.

మరోవైపు ప్రకాశ్ రాజ్ పైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ఏమాత్రం  విజయ పరిజ్ఞానం లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షాలు హిందువులు కాదని అనడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. గౌరీ లంకేష్ మృతి పట్ల స్పందించకపోతే హిందువు కానట్లేనా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేరళలో 19 మంది ఆరెస్సెస్ యువకులు చనిపోతే ప్రకాశ్ రాజ్‌కు బాధ అనిపించలేదా అని నిలదీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు