ఒక్క సైబ‌రాబాద్ పోతే...నాలుగు నిర్మిస్తాం

ఒక్క సైబ‌రాబాద్ పోతే...నాలుగు నిర్మిస్తాం

`విభజన అన్యాయం మాలో మరింత కసిని నింపింది. ఆ కసితోనే పనిచేస్తున్నాం. ఒక సైబరాబాద్‌ పోతే.. ఆ స్థానంలో నాలుగు సైబరాబాద్‌లు నిర్మిస్తాం. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం యువత మరేప్రాంతానికి వెళ్లకుండా ప్రణాళికలు తయారుచేస్తున్నాం` ఇవి ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి లోకేష్ వ్యాఖ్య‌లు విజయవాడలో టై అమరావతి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విభజన చేసినవారు అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రావ్యాలీ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి తమకు మార్గనిర్దేశం చేశారని మంత్రి లోకేష్ తెలిపారు. ఒక సైబరాబాద్‌ను కోల్పోయాం...అందుకే నాలుగు సైబరాబాద్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్వేగభరితంగా చెప్పారు. విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి, అనంతపురంలో నాలుగు ఐటీ క్లస్టర్లు రాబోతున్నాయన్నారు. సైబరాబాద్‌ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌ గుర్తుకొస్తుందని, అలానే ఇప్పుడు తిరుపతి పేరు చెప్పగానే జోహూ గుర్తుకొస్తుందన్నారు. విశాఖకు పెద్ద కంపెనీలు అయిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్స్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌, కాన్డ్యూయెంట్‌, పేటీఎం లాంటివి వస్తున్నాయని తెలిపారు. అమరావతికి హెచ్‌సీఎల్‌ వచ్చిందని, దీంతో అమరావతి డేటా సెంటర్‌ హబ్‌గా మారబోతోందన్నారు. అనంతపురంలో బెంగళూరు ప్లస్‌ ప్లస్‌ ప్రాజెక్టు పేరుతో త్వరలోనే క్లస్టర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఒక్కో క్లస్టర్‌లో 2.5 లక్షల ఉద్యోగాలు, పది ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నామన్నారు.

రాజధాని అంటే రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదని, ప్రజా రాజధానిని నిర్మించాలని లోకేష్ అన్నారు. ప్రజా రాజధాని కావాలి అంటే ఉద్యోగాలు, ఉపాధి ఇక్కడే రావాలన్నారు. ఒకప్పుడు రాళ్లు, రప్పల మధ్య సైబరాబాద్‌ ఏర్పాటయిందని చెప్పారు. ఒక్క సైబర్‌ టవర్‌ వల్ల ఇప్పుడు హైదరాబాద్‌లో 6 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న రాజధాని సైబరాబాద్‌ పోయింది అన్న బాధ అంతకు మించి అభివృద్ధి సాధించాలన్న కసితో పనిచేస్తున్నామని పేర్కొ న్నారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2019లోపు లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 9 నెలల్లోనే ఐటీ రంగంలో 24 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్‌లో 10 వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఇప్పటివరకు మంగళగిరి క్లస్టర్‌లో 25 కంపెనీలు, 2 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు.

న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన ప్పుడు ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదని మంత్రి లోకేష్ తెలిపారు. అప్పుడు ఒక్క ఫోన్‌ కూడా తయారు కాలేదని చెప్పారు.  కానీ ఇప్పుడు దేశంలో తయారవుతన్న 10 ఫోన్లలో 2 మన రాష్ట్రంలోనే తయారవు తున్నాయన్నారు. ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి డీటీపీ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఐఐటీ పాలసీ తీసుకొచ్చామని వివరించారు. ఐటీ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ 8 యాక్సలరేటర్‌ ద్వారా పెద్ద ఎత్తున స్టార్ట్‌ అప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలి అనే ఆశ ఉండటంలో తప్పులేదని చెప్పారు. కానీ, మొదటి అడగుగా ఎదో ఒక కంపెనీలో ఉద్యోగం సాధించి ప్రయాణం మొదలు పెట్లాలని సూచించారు. అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆ దిశగా విద్యార్థుల ఆలోచనాసరళి మారాలని మంత్రి లోకేష్‌ వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు