వ‌ల‌స‌ల విష‌యంలో ట్రంప్ మాట మారింది చూశారా?

వ‌ల‌స‌ల విష‌యంలో ట్రంప్ మాట మారింది చూశారా?

వ‌ల‌స‌ల విష‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఎటూ తేల్చుకోలేక‌పోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. చెత్త దేశాల నుండి తమ దేశానికి ఎవరూ వలసలు రావాల్సిన అవసరం లేదంటూ గత వారం చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నైపుణ్యమున్న వలసదారులకు ప్రాధాన్యం కల్పించనున్నట్టు ఆయ‌న స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఎవరైనా తమ దేశానికి వలస రావచ్చని అన్నారు. అయితే, తమ దేశానికి వచ్చే వారికి కొన్ని అర్హతలు ఉండాలని అన్నారు. ప్రతిభ ఆధారంగానే వలస విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నామని ట్రంప్‌ చెప్పారు.

చిన్నతంలోనే అమెరికాకు వలస వచ్చిన వారిపై కార్యాచరణ (డీఏసీఏ) విధానంపై రాజీకి రావడానికి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కసరత్తు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ప్రతిభ, నైపుణ్యం వున్నవారు ఎక్కడ నుండి వచ్చినా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వారే ప్రస్తుతం తమకు కావాలని పేర్కొన్నారు. అమెరికాను, అమెరికన్లను ప్రేమించేవారు, ప్రతిభా నైపుణ్యాలు కలవారు, ఆంగ్ల భాషలో సామర్ధ్యమున్నవారు, తమ విలువలను, జీవన విధానాన్ని సమర్ధించేవారు ఎవరైనా తాము వారిని స్వాగతిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా..ట్రంప్‌ సర్కార్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి గడువు దాటేలోగా ట్రంప్‌ ప్రభుత్వం వ్యయ బిల్లును ఆమోదించలేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదముంది. రిపబ్లికన్ల నియంత్రణలోని కాంగ్రెస్‌ ఈలోగా తాత్కాలిక అవసరాల కోసం రూపొందించిన నిధులను సమకూర్చుకునే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోద ముద్ర వేయించే పనిలో నిమగమైంది. రక్షణ వ్యయం బాగా పెంచాలని కన్జర్వేటివ్‌లు కోరుతున్నారు. తాత్కాలిక బిల్లులో అటువంటివి చేర్చే అవకాశం ఉండదు. కాగా ఇమ్మిగ్రేషన్‌ (వలసల) విధానం పరిష్కారమైతే తప్ప ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరాదని పలువురు డెమోక్రట్లు భావిస్తున్నారు. పిల్లలుగా వున్నపుడు దేశంలోకి వచ్చిన వారిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకునే దిశగా గత వారం జరిగిన చర్చల్లో అకస్మాత్తుగా నిలిచిపోయాయి.

ఆ తర్వాత చర్చలు జరిపేందుకు వాతావరణం అనువుగా లేకుండా పోయింది. కొంతమంది సెనెటర్లు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్‌ తిరస్కరించడంతో రిపబ్లికన్లు, డెమోక్రట్ల మధ్య తలెత్తిన విభేదాలు ఆప్రికా దేశాల నుండి వచ్చే వలసలను ఉద్దేశిస్తూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా నివారించడానికి తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటనే అంశంపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు సమావేశం కానున్నట్టు కాంగ్రెస్‌ సభ్యులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English