టీడీపీకి గూటికి వంగ‌వీటి రాధా...వివాదం సంగ‌తి ఏంటో?

టీడీపీకి గూటికి వంగ‌వీటి రాధా...వివాదం సంగ‌తి ఏంటో?

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనున్న‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీకి కీల‌క నేత గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వంగవీటి రాధాకృష్ణ‌  వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈనెల 22న రాధా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత‌, వైఎస్ జ‌గన్ విజయవాడ సెంట్రల్ సీట్ హామీ ఇవ్వక పోవడంతో రాధా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు హామీతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సెంట్రల్ టికెట్, వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌కు తూర్పు, యలమంచిలి రవిని పార్టీ లోకి తెచ్చి పశ్చిమ టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వంగవీటి రాధాను అవనిగడ్డ వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని, దీంతో టీడీపీలో చేరేందుకు రాధా నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ‌ వైసీపీ వీడటంతో, గుడివాడతో సహా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ టీడీపీ కి అనుకూలమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా, గ‌త ఏడాది టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై రాధా ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ టీవీ ఇంటర్వ్యూలో సీనియ‌ర్ నేత‌ గౌతంరెడ్డి వంగవీటి మోహన్‌రంగాపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అభిమానులు ఆరోపించారు. రంగా హత్యపై కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆయ‌న భార్య వంగ వీటి రత్నకుమారి, కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించింది. దీంతో వారు కోపోద్రిక్తులై, గౌతంరెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడం, రోడ్లపైకి వచ్చి,నిరసన తెలియజేశారు. ఈ ప‌రిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డ్డారు.

ఆ పార్టీ నేత‌ల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని, వైసీపీ నాయ‌కులు గుండాల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై వంగవీటి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు.చంద్రబాబు సీఎం స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో వాస్త‌వాల‌ను గ‌మ‌నించి కామెంట్లు చేయాల‌ని వంగ‌వీటి రాధా సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు ముఖ్య‌మంత్రిని విమర్శించినా పట్టించుకోని పరిస్థితి ఉంద‌ని ఎద్దేవా చేశారు. దీన్ని బ‌ట్టే ఏ పార్టీ నేత‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటిస్తారో అర్థ‌మ‌వుతోంద‌ని వంగ‌వీటి రాధా అన్నారు.

చంద్రబాబుకు కనీస కామన్ సెన్స్ లేదని మండిప‌డ్డారు. లా అండ్ ఆర్డర్ పై సీఎంకు పట్టులేదని వంగ‌వీటి రాధా వ్యాఖ్యానించారు. విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో అస‌లు ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడారని  అన్నారు.కాగా, ఈ వివాదం, వ్యాఖ్య‌లు వ‌దిలేసి వంగ‌వీటి రాధా టీడీపీలో చేర‌డం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని ప‌లువురు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు