అచ్చెన్న‌కు ప్రాణ‌భ‌యం క‌లిగేలా జ్యోతిష్యుడి ప్లాన్‌

అచ్చెన్న‌కు ప్రాణ‌భ‌యం క‌లిగేలా జ్యోతిష్యుడి ప్లాన్‌

జ్యోతిష్యం పేరుతో మాయ‌మాట‌లు చెప్పి.. హోమాలు.. యాగాలు చేయించే ఒక జ్యోతిష్యుడి స్కెచ్ ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిన్నా.. చిత‌కా పూజ‌లు.. శాంతులు చేస్తే లాభం ఏముంటుంద‌ని అనుకున్నాడో ఏమో కానీ.. ఏపీ మంత్రి అచ్చెన్న లాంటి వారిని టార్గెట్ చేస్తే పేరుకు పేరు.. భారీగా డ‌బ్బు సంపాదించొచ్చ‌న్న అత్యాశ ఇప్పుడు జైల్లో కూర్చునేలా చేసింది.

మంత్రికి ప్రాణ‌హాని ఉంద‌న్న భ‌యాన్ని క‌లిగించి సొమ్ము చేసుకునేందుకు జ్యోతిష్యుడు ఒక‌రు వేసిన ప్లాన్ బెడిసి కొట్ట‌ట‌మే కాదు.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలో జ్యోతిష్యుడిగా.. యాజీగా ముర‌పాక కాళిదాసుశ‌ర్మ ప్ర‌ముఖుల‌కు ట‌చ్ లో ఉంటుంటాడు. నాయ‌కులు.. సెల‌బ్రిటీల‌లో చాలామందికి న‌మ్మ‌కాలు ఎక్కువ‌గా ఉండ‌టం మామూలే.
స‌రిగ్గా ఈ బ‌ల‌హీన‌త మీద‌నే ఫోక‌స్ చేశాడు కాళిదాసు శ‌ర్మ‌. తన‌ను న‌మ్మేవారిని నిత్యం వారి గ్ర‌హాలు.. జాత‌కాలు అనుకూలంగా లేవ‌ని.. ప్ర‌త్యేక పూజ‌లు.. హోమాలు చేయిస్తే ప‌రిస్థితి మారుతుంద‌ని న‌మ్మించేవాడు. త‌న‌కు తోడుగా ఒడిశా రాయ‌గ‌డ‌కు చెందిన జ్యోసుల శంక‌ర‌రావును అనుచ‌రుడిగా పెట్టుకున్నారు.

ఆ మ‌ధ్య ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓ భారీ హోమాన్ని నిర్వ‌హించారు. దాదాపు రూ.80ల‌క్ష‌ల ఖ‌ర్చుతో శ్రీ సౌభాగ్య విద్వేశ్వ‌రి పంచాయ‌త‌న యాగాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెబుతారు. ఈ యాగం కూడా కాళిదాసు శ‌ర్మే ద‌గ్గ‌రుండి చేయించ‌టం గ‌మ‌నార్హం. గ‌త న‌వంబ‌రులో నిర్వ‌హించిన యాగం మాదిరే.. ఈసారి మ‌రింత భారీగా యాగాన్ని మంత్రి చేత చేయించ‌టానికి ఆయ‌న వీర‌లెవ‌ల్లో ప్లాన్ వేశారు.

మంత్రికి ప్రాణ‌హాని ఉంద‌న్న భావ‌న క‌లిగించ‌టానికి..గ్ర‌హాలు అనుకూలంగా లేవ‌న్నట్లు న‌మ్మేలా చేయ‌టానికి సినిమాటిక్ ప్లాన్ వేశాడు. ఆయ‌న‌కు న‌క్స‌ల్స్ నుంచి ముప్పు ఉంద‌ని.. ప్రాణ‌హానికి అవ‌కాశం ఉంద‌న్న భావ‌న‌ను న‌మ్మేలా చేయ‌టానికి వేరే సిమ్ తో బెదిరింపు కాల్స్ తో  పాటు.. ఆయ‌న ప్ర‌యాణించే వార్గంలో జెలెటిన్  స్టిక్స్ ఏర్పాటు చేశారు. మంత్రి అచ్చెన్న‌కు వ‌స్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ మీద దృష్టి పెట్టిన పోలీసులు తీగ లాగితే.. ముక‌పాక కాళిదాసు శ‌ర్మ భాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మంత్రికి ప్రాణ‌హాని ఉంద‌న్న భావ‌న క‌లిగేందుకే ఇదంతా చేసిన‌ట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో.. అత‌గాడిని అదుపులోకి తీసుకొని జైలుకు త‌ర‌లించారు. ఈ వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు