సుప్రీం వివాదంపై ఆర్కే సూటి ప్ర‌శ్న‌లు..!

సుప్రీం వివాదంపై ఆర్కే సూటి ప్ర‌శ్న‌లు..!

కొన్ని అంశాల్ని ప‌క్క‌న పెడితే.. ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మాని రాధాకృష్ణ‌ను అభినందించాల్సిందే.  స్వ‌త‌హాగా జ‌ర్న‌లిస్టు కావ‌టం వ‌ల్ల కాబోలు.. సున్నిత అంశాల్ని సైతం ప్ర‌స్తావించేందుకు ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌ని త‌త్త్వం ఆయ‌న‌లో మొండుగా క‌నిపిస్తుంది.

అస‌లే జ‌ర్న‌లిస్టు.. ఆపై మొండిత‌నం.. ప్ర‌శ్నించే తత్త్వం పాత్రికేయుడి స‌హ‌జ ల‌క్ష‌ణం అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది.  విష‌యం ఏదైనా  కుండ బ‌ద్ధ‌లు కొట్టే తీరున్న ఆర్కే.. తాజాగా త‌న వారాంతం వ్యాసాన్ని ఆస‌క్తిక‌ర  అంశంపై ఫోక‌స్ చేశారు. నిజానికి  కోర్టు.. కోర్టు సంబంధిత వార్త‌ల విష‌యంలో అన్ని మీడియా సంస్థ‌లు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఎటొచ్చి.. ఏం జ‌రిగినా కోర్టు ధిక్కార  నేరాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న అప్ర‌మ‌త్త‌త వారి వార్త‌ల్లో క‌నిపిస్తూ ఉంటుంది.

ఇలాంటివేళ‌.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్త‌లు మ‌ధ్య నెల‌కొన్న వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది. ఈ అంశంపై ఆర్కే సూటిగా త‌న అభిప్రాయాన్ని వెళ్ల‌గ‌క్కేశారు. తెలుగు మీడియాలో ఇంత సూటిగా.. స్ప‌ష్టంగా సుప్రీం వివాదాన్ని ప్ర‌స్తావించి.. చ‌ర్చించిన మొట్ట‌మొద‌టి మీడియా య‌జ‌మాని ఆర్కేనే అవుతారేమో. ఆయ‌న రాసిన తాజా వ్యాసం చూస్తే.. న‌లుగురు సుప్రీం జ‌డ్జిలు ప్రెస్ మీట్ పెట్ట‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపించారు. అలా అని ఆ విష‌యాన్ని నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న రాసిన వ్యాసం మొత్తం చదివినంత‌నే అనిపించే భావ‌న ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
త‌న వ్యాసంలో సుప్రీం సంక్షోభం నేప‌థ్యంలో.. ప్రెస్ మీట్ పెట్టిన న‌లుగురు న్యాయ‌మూర్తుల‌కు కొన్ని ప్ర‌శ్న‌ల్ని సంధించ‌టం క‌నిపిస్తుంది. న‌లుగురు న్యాయ‌మూర్తుల‌కు వ్య‌క్తిగ‌తంగా కాకున్నా.. వారి ప్రెస్ మీట్ ను దృష్టిలో పెట్టుకొని ఆ ఉదంతంపై ఆయ‌న సంధించిన సందేహాలు ఆలోచించేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత ధైర్యంగా త‌న సందేహాల్ని వ్య‌క్తం చేసేందుకు వెనుకాడ‌ని ఆర్కేను అభినందించ‌కుండా ఉండ‌లేం.

ఇక‌.. ప్రెస్ మీట్ పెట్టిన న‌లుగురు న్యాయ‌మూర్తుల తీరుపై ఆర్కే సంధించిన ప్ర‌శ్నాస్త్రాలు.. అందుకు త‌న వాద‌న‌ను ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

ఇప్పుడు నలుగురు న్యాయమూర్తుల చర్య సుప్రీంకోర్టు గౌరవాన్ని భంగపరచినట్టు కాదా? సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనీ, కేసుల కేటాయింపులో పద్ధతి లేకుండా పోవడం వల్లనే విధిలేని పరిస్థితులలో బయటపడాల్సి వచ్చిందని ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నలుగురు న్యాయమూర్తులూ చెప్పుకొచ్చారు. ఇలా అయితే ప్రజాస్వామ్యానికే ముప్పు అని కూడా ఆందోళన చెందారు. వారి ఆవేదనలో అర్థం ఉండవచ్చు గానీ, అందుకు వారు ఎంచుకున్న మార్గమే అభ్యంతరకరంగా ఉందని మెజారిటీ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఈ నలుగురు న్యాయమూర్తులూ న్యాయ వ్యవస్థలో సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు.

ఈ పరిణామం ఇకపై న్యాయ వ్యవస్థలో ఎలాంటి విపరీత పోకడలకు దారితీస్తుందో చూడాలి. ఈ చర్యను ఆదర్శంగా తీసుకుని ఇకపై వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులలో కూడా ప్రధాన న్యాయమూర్తిపై న్యాయమూర్తులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే పరిస్థితి ఏమిటి?

అలాంటి ధోరణులను చక్కదిద్దవలసిన సుప్రీంకోర్టుకు ఇకపై ఆ నైతిక హక్కు ఉంటుందా?

న్యాయ వ్యవస్థలోనే లుకలుకలు ఏర్పడితే దాని ఔన్నత్యం ఏమి కావాలి?

సుప్రీంకోర్టు అంటే కిందిస్థాయి న్యాయ వ్యవస్థకే కాదు- ఈ దేశ ప్రజలందరికీ గౌరవంతో పాటు భయం– భక్తి కూడా ఉండేవి. ఇప్పుడు ఇలా బజారున పడిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుందా?
మనకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తేడా ఏమిటి? అని సామాన్య ప్రజలు ప్రశ్నించుకోరా?

తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయించేవారిని వివిధ స్థాయిలలోని న్యాయమూర్తులు అడిగే మొదటి ప్రశ్న ‘‘మీరు ముందుగా సమస్య పరిష్కారానికి సంబంధించిన వేదిక వద్దకు వెళ్లారా?’’ అన్నది.

హైకోర్టు స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ముందుగా హైకోర్టును ఆశ్రయించండి అని సూచిస్తుంటారు. ఈ సూత్రం ఆ నలుగురు న్యాయమూర్తులకు వర్తించదా?
 
తమ ముందు మరో ప్రత్యామ్నాయం ఏదీ లేకనే మీడియా ముందుకు వచ్చామని వారు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకునే అధికారం, సమర్థత సుప్రీంకోర్టుకు ఉంటుంది కదా! ఇతర వ్యవస్థలలో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆదేశిస్తుంటారు కదా! తమ విషయం వచ్చేసరికి అలా ఎందుకు చేయలేకపోయారు?

తమను తామే నియమించుకునే అధికారం ఉన్నవారు కేసుల కేటాయింపు నుంచి అన్ని విషయాలకూ మార్గదర్శకాలు రూపొందించుకోలేరా? అన్న సందేహం సామాన్యులకు కలగకుండా ఎందుకుంటుంది? మన దేశంలో ప్రతి వ్యవస్థకూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఈ కట్టుబాట్లకు న్యాయ వ్యవస్థ మాత్రం అతీతం ఎలా అవుతుంది? ప్రధాన న్యాయమూర్తి గానీ, మరో న్యాయమూర్తి గానీ న్యాయంగా వ్యవహరించనప్పుడు సరిదిద్దుకునే వ్యవస్థ ఉండాలి కదా!

ఇతర వ్యవస్థలలోని తప్పొప్పులను ఎత్తిచూపే న్యాయ వ్యవస్థ తనలోని తప్పొప్పులను కూడా గుర్తించి సరిదిద్దుకోవడానికై ఆత్మపరిశీలన చేసుకోవలసిన తరుణం ఆసన్నమయ్యింది. అలా కాకుండా అంతా మా ఇష్టం అనుకుంటే ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు గానీ సుప్రీంకోర్టు అన్నా, అది ఇచ్చే తీర్పులన్నా ప్రజలకు గౌరవం పోయే పరిస్థితి వస్తోంది. కేసు విచారణకు హాజరయ్యే కక్షిదారులకు డ్రెస్‌ కోడ్‌ ఉండాలనీ, జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు వంటివి వేసుకోకూడదని న్యాయమూర్తులు మందలించిన వార్తలు విన్నాం.

అలాంటప్పుడు న్యాయమూర్తులు కూడా ఉన్నతంగా వ్యవహరించాలని ఆశించే హక్కు పౌరులకు లేదా? న్యాయ వ్యవస్థపై అజమాయిషీ చేయడానికి రాజకీయ వ్యవస్థ కాచుకుని ఉంది. ఆ అవకాశం రాజకీయ వ్యవస్థకు ఇవ్వాలా? లేదా? అన్నది న్యాయమూర్తులే తేల్చుకోవాలి. కేసులను ఏ బెంచ్‌కు కేటాయించాలన్న విషయంలో పూర్తి అధికారం ప్రధాన న్యాయమూర్తులకే ఉంటుంది.
ఈ విషయాన్ని గతంలో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం కూడా ధ్రువీకరించింది. జస్టిస్‌ లోయా మృతి కేసును సీనియర్ల బెంచ్‌కు కాకుండా జూనియర్లున్న డివిజన్‌ బెంచ్‌కు కేటాయించడం ఏమిటన్న ప్రశ్నను జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రభృతులు లేవనెత్తారు. ఏ కేసునైనా మొదట డివిజన్‌ బెంచ్‌కే కేటాయిస్తారనీ, కేసు ప్రాధాన్యాన్ని బట్టి ఆ కేసును విస్తృత ధర్మాసనం చేపట్టాలా? లేదా? అన్నది డివిజన్‌ బెంచ్‌ నిర్ణయిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎంవోపీ విషయంలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరిగ్గానే వ్యవహరించారనీ, ఇందుకు గత తీర్పులే నిదర్శనమనీ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

ఆయా కేసుల విచారణ మధ్యలో సంబంధిత కేసులను ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి నుంచి తప్పించి మరొకరికి అప్పగించే అధికారం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని ఇంతకు ముందు తీర్పులు చెబుతున్నాయి. కేసుల కేటాయింపు విషయంలో మార్గదర్శకాలు లేనప్పుడు ఆ విషయాన్ని అభ్యంతరపెట్టడం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఆసక్తితో గమనిస్తుండగా, సామాన్యులు మాత్రం నిశ్చేష్టులై చూస్తున్నారు.

 నలుగురు న్యాయమూర్తుల విలేకరుల సమావేశం తర్వాత సీపీఐ నాయకుడు డి.రాజా, జస్టిస్‌ చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం కూడా వివాదాస్పదం అవుతోంది. ఒకసారి వివాదానికి తెర లేపితే అన్నీ వివాదాలే అవుతాయి. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికై అధికార భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తంమీద న్యాయమూర్తుల మధ్య తలెత్తిన విభేదాలు న్యాయ వ్యవస్థపైనా, ప్రత్యేకంగా న్యాయమూర్తుల గౌరవంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారి గౌరవాన్ని అవి మంటగలిపాయి. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించి ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చు గానీ, న్యాయ వ్యవస్థకు జరిగిన అగౌరవాన్ని ఎవరు తొలగిస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న.  ‘కోడలికి బుద్ధి చెప్పాల్సిన అత్తే తెడ్డు నాకినట్టు’ ఇతర వ్యవస్థలు దారితప్పకుండా కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ దారితప్పి కట్టుబాటు తెంచుకుంటే మన గతి ఏమిటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు