బీజేపీకి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కువెళ్లే దైర్య‌ముందా? : కేటీఆర్‌

బీజేపీకి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కువెళ్లే దైర్య‌ముందా? : కేటీఆర్‌

ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియాతో ముచ్చ‌టించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ సంద‌ర్భంగా అనేక ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, కొనుగోళ్ల విష‌యంలో విప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఆరోప‌న‌లు చేస్తున్న తీరుపై మండిప‌డిన మంత్రి ఈ సంద‌ర్భంగా వారికి స‌వాల్ విసిరారు. అవినీతికి పాల్పడి జైల్లో చిప్పకూడు తిన్నవాళ్లు నీతి వ్యాక్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని  ఎద్దేవా చేశారు. డబ్బులతో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లివచ్చిన వాళ్లు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. అటువంటి నాయకుడి సవాళ్లకు తాము స్పందించాల్సిన అవసరంలేదని చెప్పారు. ప్రభుత్వంపై నిందలు వేసే ప్రతిపక్షాలు నిజంగా ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని  అన్నారు.

శనివారం మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం  నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని, సాగునీరు, రైతులకు పెట్టుబడి పథకాలు చూసి బెంబేలెత్తుతున్నాయని విమర్శించారు. ఈ పథకాలతో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తున్నదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని బట్టి వారిలోని అసహనాన్ని అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే పారిపోతారని, బయట మాత్రం రచ్చ చేస్తారని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయానికి నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తుండటంతో రైతులు సంతోషంగా ఉంటే, కాంగ్రెస్‌ నేతలకు కడుపు మండుతున్నదని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ స్థిరపడితే ఎప్పటీకి అధికారంలోకి రాలేమన్న భయం కాంగ్రెస్‌ నేతలను వెంటాడుతున్నదన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన తరువాత తెలంగాణ తీవ్ర విద్యుత్‌ కొరతను ఎదుర్కొన్నా, కష్టాల్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరంటు ఇవ్వలేదని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఒప్పందాలు చేసుకున్న తరువాత విద్యుత్‌ ఇస్తామని ఆ రాష్ట్రం ముందుకొస్తే ఏం చేసుకోవాలని ప్రతిపక్షాలను ఆయన  ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తమది పనిచేసే ప్రభుత్వమని, ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపారు. చట్టంపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం అవసరంలేదని, అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీల ప్రతినిధులు మాట్లాడవచ్చునని సూచించారు. ఇసుక తవ్వకాలపై గవర్నర్‌ నేరుగా కలెక్టర్‌, ఎస్పీలను సంప్రదించి సమాచారం తీసుకున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకొనే కాంగ్రెస్‌ నేతలతో గవర్నర్‌ మాట్లాడారని కేటీఆర్‌ తెలిపారు. మూడు సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.1300 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పర్యావరణ అనుమతులు రాగానే ఫార్మా సిటీ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి విదేశ పర్యటనకు వెళుతున్నానని, దావోస్‌లో అగ్రగ్రామి సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతానని కేటీఆర్‌ వెల్లడించారు. జపాన్‌, కొరియా, స్విట్జర్లాండ్‌లలో కూడా పర్యటిస్తానని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు