కేసీఆర్ అవినీతిని ప్రూవ్ చేయ‌కుంటే రాజీనామా

కేసీఆర్ అవినీతిని ప్రూవ్ చేయ‌కుంటే రాజీనామా

ఒళ్లు అల‌వ‌కుండా.. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల జోలికి వెళ్ల‌కుండా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌మ మాట‌ల‌కు రావాల్సినంత మైలేజీని తెచ్చుకునే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. గ‌తంలో ఏదైనా ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ.. స‌ర్కారును చీల్చి చెండాడేవారు.

ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ అధికార‌ప‌క్షం తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్నారు. జ‌నంలోకి వెళ్ల‌కుండా మీడియాతో మాట్లాడ‌టం ద్వారా త‌మ‌పై నింద‌లు వేస్తున్న కాంగ్రెస్ నేత‌ల తీరును గులాబీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అయితే.. గాంధీ భ‌వ‌న్ లో లేదంటే.. సీఎల్పీ ఆఫీసులో వ‌రుస ప్రెస్ మీట్లు పెట్టే క‌న్నా.. జ‌నం మ‌ధ్యకు రావాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ప‌థ‌కంతో భారీ మైలేజీ పొందాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న టీఆర్ఎస్ ముఖ్య‌మంత్రికి కౌంట‌ర్ ఇచ్చే ల‌క్ష్యంగా కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప‌ని చేస్తున్నారు. అలాంటి వారిలో రేవంత్ రెడ్డి.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. తాజాగా విద్యుత్ ప్రాజెక్టుల‌లో వేలాది కోట్ల రూపాయిల అవినీతికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్ప‌డ్డార‌న్న తీవ్ర ఆరోప‌ణ చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు కుదుర్చుకున్న ఒప్పందాల్ని తీవ్రంగా త‌ప్పు పడుతున్న కోమ‌టిరెడ్డి తాజాగా భారీ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే విద్యుత్ అవినీతిపై త‌న‌తో చ‌ర్చ‌కు రావాల‌ని..ఒక‌వేళ కుద‌ర‌దంటే ట్రాన్స్ కో.. జెన్ కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు.. ఇత‌ర అధికారుల్ని చ‌ర్చ‌కు పంపాల‌న్నారు. ఒక‌వేళ‌.. తాను కానీ అవినీతిని నిరూపించ‌కుంటే అదే రోజు సాయంత్రం స్పీక‌ర్‌కు రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని భారీ వ్యాఖ్య‌నే చేశారు.

అయితే.. ప‌వ‌ర్ చ‌ర్చ‌కు ప‌వ‌ర్ లేని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాత్రం రావొద్దంటూ వ్యంగ్య‌స్త్రాన్ని సంధించారు. యూనిట్ రూ.5ల‌కు 500 మెగావాట్ల సోలార్ విద్యుత్తుకు టెండ‌ర్లు పిలుద్దామంటే విన‌కుండా.. యూనిట్ రూ.6ల‌కు పాతికేళ్ల‌కు 2వేల మెగావాట్ల కు టెండ‌ర్లు పిలిచార‌న్నారు. రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని.. ఇందుకోసం రూ.105 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేశార‌న్నారు. ఆ డ‌బ్బును మందుల‌కు నిధులు కావాలంటూ ఆర్నెల్ల క్రితం గాంధీ ఆసుప‌త్రికి కేటాయిస్తే బాగుండేద‌న్నారు. బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ మాదిరే.. కేసీఆర్‌కు జైలుశిక్ష త‌ప్ప‌ద‌న్నారు. విద్యుత్ రంగంలో అవినీతిపై అనేస‌రికి టీఆర్ఎస్ నేత‌లు తోక‌ముడి పారిపోయారంటూ ఫైర్ అయ్యారు. ఏమైనా విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఘాటు ఆరోప‌ణ‌ల‌కు.. అంత బ‌లంగా టీఆర్ఎస్ నేత‌లు రియాక్ట్ కావ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు