రజనీపై కమల్ ఉక్రోశం

రజనీపై కమల్ ఉక్రోశం

తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న సినిమా నటులు బరిలో దిగే ధైర్యం చేయలేకపోతున్నారు కానీ, వారిలో వారే పోటీ పడుతున్నారు. ఒకరికి ఒకరు పోటీగా భావిస్తున్నారు. ఇంతకాలం గుంభనంగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా కమల్ హాసన్ కామెంట్లతో బయటపడింది. గత ఏడాది రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన కమల్ హాసన్ ఇప్పటికీ దానికి సంబంధించి ముందడుగు వేయలేదు. ఈలోగా మరో దిగ్గజ నటుడు రజినీ కాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీని అనౌన్స్ చేశారు. ఆయన ప్రకటించిన వెంటనే ఎంతో గొప్పగా స్వాగతించిన కమల్ ఇప్పుడు పరోక్ష విమర్శలు చేస్తున్నారు.

    తాజాగా ఆయన ఆనంద వికటన్ పత్రికలో రాసిన ఓ కాలమ్‌లో సినిమాలకు లింకు పెడుతూ అన్యాపదేశంగా రజినీపై విమర్శలు చేశారు. సినిమాల్లో మన స్క్రిప్టును ప్రత్యర్థులు దొంగిలించి మనకంటే ముందే సినిమాలు తీసినట్లే.. రాజకీయాల్లోనూ ఇతరులు మన ప్రణాళికలను మన కంటే ముందే అమలు చేస్తున్నారని అన్నారు. ఇది రజినీ గురించే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    మరోవైపు ఆయన రాజకీయ పార్టీ పనులు పూర్తవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కమల్ అంటున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా పార్టీ ప్రారంభిస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా మారే స్నేహితులను ఎలా డీల్ చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అందరు నాయకుల్లా తాను నీచ రాజకీయాలు చేయనని... తన అభిమానులు కూడా అలా చేయరని అన్నారని.. మొత్తానికి రజనీ, కమల్ ఇద్దరూ ప్లానింగ్ తో సరిపెట్టి పార్టీని వాయిదా వేసేలా కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు