ఫేస్‌బుక్‌తో భువ‌నేశ్వ‌రి ముందుకు...రాజ‌కీయాల‌కు నో

ఫేస్‌బుక్‌తో భువ‌నేశ్వ‌రి ముందుకు...రాజ‌కీయాల‌కు నో

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ త‌న‌య ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి త‌న సేవా కార్యాక్రమాల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న దేశ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి ఇందుకు ఫేస్‌బుక్ స‌హాయం తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ లెజండరీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు భువనేశ్వరి వివ‌రించారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న లెజండరీ రక్తదాన శిబిరంలో భాగస్వామ్యం కావడానికి ‘ఫేస్‌బుక్’ ముందుకు వచ్చిందని ఆమె తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో 140 చోట్ల, ఇంకా 16 రాష్ట్రాల్లో 160 చోట్ల లెజండరీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని దేశం మొత్తం చాటాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. ఇదే ఎన్టీఆర్‌కు అర్పించే గొప్ప నివాళిగా తాము భావిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ రక్తదాన శిబిరాల్లో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ, లయన్స్ క్లబ్, బసవతారకం, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ భాగస్వామ్యం అవుతాయని భువనేశ్వరి చెప్పారు.

రక్తదాన శిబిరంలో భాగస్వామ్యం కావడానికి ‘ఫేస్‌బుక్’ ముందుకు వచ్చిందని, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయడానికి ‘ఫేస్‌బుక్’ ఎంతో ఉపయోగపడుతుందని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. రక్తదాన శిబిరానికి 300 ఫేస్ బుక్ ఈవెంట్స్‌ను తీసుకుని ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫేస్‌బుక్ సహకారంతో ఎవరికైనా రక్తం అవసరమైతే మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులకు సమాచారం అందించడం ద్వారా, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే వారికి త్వరగా అందించడానికి ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.

ఈ నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. దానం చేసే రక్తంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆమె అన్నారు. తాము ఇప్పటి వరకు 4 లక్షల మంది నుంచి రక్తం సేకరించి, రెండున్నర లక్షల మందికి పైగా రక్తదానం చేసినట్లు ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడనని భువనేశ్వరి మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఫేస్ బుక్ ద్వారా సుమారు 40 లక్షల మంది బ్లడ్ డోనర్స్‌గా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో పేరు నమోదు చేసుకున్నారని సిఇవో విష్ణువర్ధన్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు