కేసీఆర్ క‌న్నెర్ర‌...400 డిగ్రీ కాలేజీలు మూత‌?

కేసీఆర్ క‌న్నెర్ర‌...400 డిగ్రీ కాలేజీలు మూత‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విద్యారంగంపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. విద్యారంగంలో సంచ‌ల‌న మార్పున‌కు వేదిక‌గా నిలిచిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కార‌ణంగా త‌న స‌ర్కారు ఇర‌కాటంలో ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య‌కు పైపై ప‌రిష్కారం కాకుండా..మూలాల్లోంచి ప‌రిష్కారం కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో 400 డిగ్రీ కాలేజీల‌ను మూత‌వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల‌మైన మార్పులు తీసుకురావాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశం మేర‌కు ఉన్నత విద్యా మండలి స‌మావేశం అయింది. తెలంగాణలో నాణ్యమైన ఉన్నత విద్య అందించడం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయడంతోపాటు, నూతన ఆవిష్కరణల కోసం ఇంక్యూబేటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిగ్రీ కాలేజీల్లో త్వరలో సమూల మార్పులు తీసుకురావా లని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, సీట్లు ఉన్నాయని అభిప్రాయ పడింది. డిగ్రీ ప్రవేశాల్లో ప్రతి ఏడాది సుమారు 1.80 లక్షల వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. వీటిపై ఉన్నత విద్యా మండలి ప్రత్యేక దృష్టి సారించింది. కాలేజీలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం గా నిర్ణయించిన ఉన్నత విద్యా మండలి కాలేజీలను తగ్గించడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనుంది. సంక్రాంతి పండుగ తరువాత ఇందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

తెలంగాణ‌ రాష్ట్రంలో సుమారు 1000కి పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 350 నుంచి 400 వరకు కాలేజీల్లో కనీసం 15 శాతం కూడా సీట్లు భర్తీ కాని పరిస్థితి ఉంది. 15 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోతే ఆయా కాలేజీలు ఎలా నడుస్తాయ నేది ఉన్నత విద్యా మండలి వాదన. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యనిర్వహక మండలి సమావేశంలో పలు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలోనూ ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేయాలని టెక్విప్‌ ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా నూతన‌ ఆవిష్కరణలు చేయడంతోపాటు యూనివర్సిటీలోని అధ్యాపకులకు నైపుణ్య శిక్షణను క్రమం తప్పకుండా ఇవ్వనున్నారు. వాటితోపాటు ఉపాధి అవకాశాలు, ఇతర ఇన్నోవేషన్లను చేయించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 5 యూనివర్సిటీల్లో ఇంక్యూబేటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉస్మానియా, కాకతీయ, జెఎన్‌టియు, జెఎన్‌యుఎఫ్‌ఏ, ఆర్‌జేకేయుటిలో ఇంక్యూబేటర్లను ఐటి శాఖ సహకారంతో ఏర్పాటు చేసింది. అయితే వీటిని రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంక్యూబేటర్‌కు రూ. 2 కోట్ల వరకు ఆర్ధికసాయాన్ని ఐటీ శాఖ అందజేయనుంది. అయితే ఈ నిధులు సరిపోవని వాటిని భవిష్యత్‌లో పెంచాల్సిన అవసరం ఉంటుంది.

400 డిగ్రీ కాలేజీల‌ను మూత‌వేయాల‌ని నిర్ణ‌యం ఈ స‌మావేశంలోని మ‌రో కీల‌క అంశ‌మ‌ని స‌మాచారం. సీట్లు మిగిలిపోవ‌డానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఉన్న‌త‌విద్యామండ‌లి వ‌ర్గాలు చెప్తున్నప్ప‌టికీ....ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అనేది కూడా ఒక కార‌ణ‌మ‌ని ...న‌కిలీ అడ్మిష‌న్ల‌కు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణ‌యం తీస‌కున్నార‌ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడ్మిష‌న్ల కార‌ణంతో మెరుగైన ప‌నితీరు గ‌ల కాలేజీల‌ను మూత‌వేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు