‘గుండు’కు సాయం.. కేటీఆర్‌పై ప్రశంసల జల్లు

‘గుండు’కు సాయం.. కేటీఆర్‌పై ప్రశంసల జల్లు

వందల సినిమాల్లో చిన్న చిన్న కామెడీ పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన నటుడు గుండు హనుమంతరావు. కొన్నేళ్లుగా ఆయనకు సినిమాలు లేవు. అమృతం సీరియల్ కూడా ఆగిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. దీనికి తోడు కిడ్నీ సంబంధిత వ్యాధి ఆయన్ని కుంగదీసింది. కొన్ని నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చాలా రోజుల నుంచి చికిత్స అందుకుంటున్నారు గుండు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు రూ.2 లక్షలు సాయం అందజేయడంతో గుండు పరిస్థితి అందరికీ తెలిసింది.

ఐతే చిరు చేసిన సాయం కూడా గుండు చికిత్సకు సరిపోలేదు. దీంతో ఆయన పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు ఇండస్ట్రీ జనాలు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సత్వరం స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద గుండుకు రూ.5 లక్షల సాయం మంజూరు చేయించారు. ఈ విషయమై ఈ రోజు సర్క్యులర్ కూడా జారీ చేయించారు. ఈ సర్క్యులర్ ప్రతిని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

దీంతో సామాజిక మాధ్యమాల్లో సెలబ్రెటీలు, సామాన్యులు అందరూ కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. చేసినవి చిన్న చిన్న పాత్రలే అయినా గుండు హనుమంతరావును తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్లో గుండు కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు