సింగిల్ పంచ్‌తో... ప‌వ‌న్ ఫైరయ్యారండోయ్‌!

సింగిల్ పంచ్‌తో... ప‌వ‌న్ ఫైరయ్యారండోయ్‌!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌పై దూసుకువ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఇప్ప‌టిదాకా పెద్ద‌గా నోరు విప్పిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. అటు సినీ రంగానికి చెందిన వారితో పాటుగా ఇటు రాజ‌కీయ రంగానికి చెందిన వారు సైతం వ‌రుస‌గా ప‌వ‌న్‌పై పంచ్ డైలాగ్‌లు విసురుతూ వార్త‌ల్లో వ్య‌క్తులుగా నిలుస్తున్నారు. రాజ‌కీయ నేత‌ల విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... కేవ‌లం పాపులారిటీ కోస‌మే సినీ రంగానికి చెందిన వారు ప‌వ‌న్ పై పంచ్‌లు పేలుస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ ఇప్ప‌టిదాకా నిజంగానే నోరు విప్ప‌లేద‌నే చెప్పాలి. అయితే నేటి ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేల్చిన ఓ పంచ్ నిజంగానే... ఆయ‌న‌పై పంచ్‌లు వేస్తున్న వారంద‌రికీ ఒకే ట్వీట్‌తో జ‌వాబు చెప్పిన‌ట్టైంద‌ని చెప్పాలి. అంతేకాకుండా కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్యం సాగిస్తున్న కాపు ఐక్య‌వేదిక నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా మొన్న‌టిదాకా అస‌లు ప‌వ‌న్‌పై మాట మాత్రంగా కూడా ఆరోప‌ణ‌లు గుప్పించిన దాఖ‌లా లేదు.

మొన్న నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా *ప‌వ‌నా? ఆయ‌న ఎవ‌రు? అలాంటి వ్య‌క్తి నాకు తెలియ‌దు* అంటూ వ్యాఖ్యానించిన ముద్ర‌గ‌డ‌... ప‌వ‌న్ ఫ్యాన్స్ తో పాటుగా మొత్తం కాపు సామాజిక వ‌ర్గాన్ని కూడా షాక్‌కు గురి చేశారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ అంత‌కుముందు వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌తో పాటు ముద్ర‌గ‌డ తానెవ‌రో తెలియ‌దంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏమాత్రం స్పందించ‌లేదు. ఇదంతా నిన్న‌టి వ‌ర‌కే... నేటి ఉద‌యం ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ త‌న‌కు పంపిన ఓ ట్వీట్‌ను ఆధారం చేసుకున్న ప‌వ‌న్‌... త‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన వారంద‌రికీ ఒకే దెబ్బ‌తో గ‌ట్టిగానే స‌మాధానం చెప్పారు. అయినా ప‌వ‌న్ సంధించిన స‌ద‌రు ట్వీట్‌లో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... *కుల స‌మీక‌ర‌ణాలు, కులం ఆధారంగా జ‌రుగుతున్న విభ‌జ‌న‌, వీటి ఆధారంగానే సాగుతున్న రాజ‌కీయం నిజంగానే ఆందోళ‌న క‌లిగించేదే. ఈ త‌ర‌హా రాజ‌కీయం మ‌న‌ ఆర్థిక ప్ర‌గ‌తితో పాటుగా స‌మాజ పురోగ‌తికి కూడా భారీగానే న‌ష్టం చేస్తుంది. మొత్తంగా విశాల స‌మాజ దృష్టి కోణాన్ని కూడా దెబ్బ తీస్తుంది* అని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్వీట్ లో ప‌వర్ పంచ్‌లు వేశారు.

అయినా మొన్న ముద్ర‌గ‌డ చేసిన వ్యాఖ్య‌ల సందర్భంగానో, అంత‌కుముందు నుంచే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందించ‌ని ప‌వ‌న్‌... నేటి ఉద‌యం మాత్రం చాలా తెలివిగా, ఘాటుగా స్పందించ‌డానికి కార‌ణంగా నిలిచిన జ‌ర్న‌లిస్ట్ ట్వీట్ ను కూడా ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్‌ను య‌థాత‌థంగా ప‌వ‌న్ కూడా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే... *వ్య‌క్తిగ‌తంగా మిమ్మ‌ల్ని ఓడించే శ‌క్తి లేని వారు... కులం, వ‌ర్గం, ధ‌నం ఆధారంగా టార్గెట్ చేస్తున్నారు* అని ఆ స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నార‌ట‌. దీనిని య‌థాత‌థంగా ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... ఆ ట్వీట్‌లో నిజంగా వాస్త‌వ‌ముంద‌నే తాను కూడా భావిస్తున్నాన‌న్న కోణంలో స్పందించారు. అంతేకాకుండా స‌ద‌రు జ‌ర్న‌లిస్టు ట్వీట్‌తో త‌న‌కు మంచి రోజులు మొద‌ల‌యిన‌ట్టేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌య్యేలానూ ప‌వ‌న్ స్పందించి సంచ‌ల‌నం సృష్టించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇటీవ‌లి కాలంలో సినీ క్రిటిక్ హోదాలో బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌త్తి మ‌హేశ్... ప‌వ‌న్‌పై వ‌రుస‌గా ట్వీట్ల యుద్ధం మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌త్య‌క్షంగా క‌త్తి మ‌హేశ్‌కు ప‌వ‌న్‌తో ఎలాంటి విభేదాలు లేకున్నా... ప్రాచుర్యం కోస‌మో, లేదంటే ఎవ‌రో ప్రోత్స‌హిస్తేనే క‌త్తి మ‌హేశ్... ప‌వ‌న్‌పై విరుచుకుప‌డుతున్నార‌న్న వాద‌న లేకపోలేదు. అదే స‌మ‌యంలో క‌త్తి మ‌హేశ్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ నిజంగానే సోష‌ల్ మీడియాలోనే కాకుండా నేరుగా ఫోన్లు చేసి కూడా ఆయ‌న‌ను బెదిరించిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలో నిన్న‌టికి నిన్న టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ రంగంలోకి దిగిపోయింది. క‌త్తి మ‌హేశ్ పై సెటైర్లు సంధించడంతో పాటుగా ప‌వ‌న్‌ను ఇక‌పై ఏమ‌న్నా స‌హించేది లేద‌న్న కోణంలోనూ త‌న‌దైన శైలిలో ఆమె క‌త్తి మ‌హేశ్‌కు వార్నింగ్ ఇచ్చినంత ప‌నిచేసింది. ఈ క్ర‌మంలో ఓ జ‌ర్న‌లిస్టు ట్వీట్ అంటూ ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌కుల‌పై ప‌వ‌ర్ పంచ్‌లు వేయ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు