బాబా మ‌రో కొత్త బిజినెస్ పై క‌న్నేశారు

బాబా మ‌రో కొత్త బిజినెస్ పై క‌న్నేశారు

న‌మ్మిన సిద్ధాంతాన్ని ప్ర‌జ‌ల‌కు ఆక‌ట్టుకునేలా చేయ‌టం వేరు. ఆ కాన్సెప్ట్ తో వ్యాపారం చేయ‌టం వేరు. కానీ.. రెండు చేసే వారు చాలా చాలా త‌క్కువ‌మంది ఉంటారు. అలాంటి వారిలో యోగా గురువు రాందేవ్ బాబా ఒక‌రు. యోగా గురువుగా సుప‌రిచితుడైన ఆయ‌న‌.. ప‌తంజ‌లి బ్రాండ్ తో కొమ్ములు తిరిగిన ఎంఎన్ సీ కంపెనీల‌కు సైతం చుక్క‌లు చూపిస్తున్న ఆయ‌న ఇప్పటికే వ్యాపారంలో దూసుకెళుతున్నారు.

రానున్న రోజుల్లో మ‌రిన్ని ఉత్ప‌త్తుల్ని మార్కెట్లోకి తీసుకురావాల‌నుకుంటున్న ఆయ‌న కొత్త ఫ్లాట్ ఫాం మీద వ్యాపారాన్ని ఓపెన్ చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నారు. ఈ- కామ‌ర్స్ మార్కెట్ మీద క‌న్నేసిన  రాందేవ్ బాబా.. త్వ‌ర‌లోనే ఆ రంగంలోకి అడుగు పెట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా అమెజాన్‌.. ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాల‌తో ప్ర‌త్య‌కంగా జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ప్ర‌పంచంలోని అతి పెద్ద ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌తో త‌మ సంస్థ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు రాందేవ్ బాబా అధికార ప్ర‌తిని టిజ‌ర‌వాలా వెల్ల‌డించారు. ప‌లు ఈ-కామ‌ర్స్ పోర్ట‌ల్స్ లో ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల ఆన్ లైన్ షాపింగ్ కోసం కొత్త ఛాప్ట‌ర్ స్టార్ట్ అవుతుంద‌ని చెప్పారు.

అంతేకాదు.. అంత‌ర్జాతీయ గ‌ట్టి పోటీ ఉన్న డైప‌ర్.. శానిట‌రీ ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో వేగ‌వంతంగా అభివృద్ది చెందుతున్న  కంపెనీల్లో  ఒక‌టిగా నిలిచింది ప‌తంజ‌లి. గ‌త ఏడాది ఫోర్బ్స్ విడుద‌ల చేసిన వార్షిక నివేదిక‌తో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో 45వ స్థానంలో నిలిస్తే.. ఈ ఏడాది 19 స్థానానికి చేరుకోవ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు