సొంత సిటీనే నాశ‌నం చేసుకున్న కిమ్‌

సొంత సిటీనే నాశ‌నం చేసుకున్న కిమ్‌

త‌న కంటిని త‌న వేల్తోనే పొడుచుకున్నాడు.. త‌న గొయ్యిని తానే త‌వ్వుకున్నాడ‌న్న సామెతలు మ‌న‌కు బాగా తెలుసు. మ‌రి.. ఇలాంటివి తెలీదో ఏమో కానీ.. త‌న మొండిత‌నంతో.. మూర్ఖ‌త్వంతో సొంత న‌గ‌రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసుకున్న ఘ‌న‌త ఉత్త‌ర‌కొరియా నియంత కిమ్ కే ద‌క్కుతుంది.

నా బ‌ల్ల మీద బ‌ట‌న్ ఉంది. దాన్ని నొక్కితే చాలు.. మార‌ణ‌హోమ‌మే అంటూ న్యూఇయ‌ర్ రోజున వెరైటీగా సందేశాన్ని ఇచ్చి ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసిన కిమ్‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. నిత్యం యుద్దోన్మాదంతో హింస గురించి త‌ర‌చూ మాట్లాడే అత‌నికి.. అత‌ను పాలించే దేశానికి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాద‌ని చెబుతున్నారు. కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

త‌ర‌చూ క్షిప‌ణి ప్ర‌యోగాలు చేసే కిమ్‌.. ఆ మ‌ధ్య‌న ప్ర‌యోగించిన ఒక క్షిప‌ణి.. ఫెయిల్ అయి సొంత న‌గ‌రాన్నే స‌ర్వ‌నాశ‌నం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ విష‌యాన్ని అమెరికా అధికారులు తాజాగా వెల్ల‌డించారు. గ‌త ఏడాది ఏప్రిల్ 28న హ్వాసంగ్ 12 అనే మ‌ధ్య త‌ర‌హా క్షిప‌ణిని ప‌రీక్షించారు. అయితే.. ఇది ఫెయిల్ అయి ప్యాంగ్యాంగ్‌కు 150 కిలోమీట‌ర్ల దూరంలోని టోక్చాన్ అనే ప‌ట్ట‌ణం మీద కూలింది.

గూగుల్ మ్యాప్స్ కార‌ణంగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. క్షిప‌ణి కూలిన‌ట్లుగా చెబుతున్న టోక్చాన్ న‌గ‌రంలో దాదాపు 2 లక్ష‌ల మంది నివ‌సిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కిమ్ ప్ర‌యోగించిన క్షిప‌ణి వ్య‌వ‌సాయ సంబంధ‌మైన భ‌వ‌నాల మీద కానీ పారిశ్రామిక భ‌వ‌న ప్రాంగ‌ణాల మీద కూలిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ప్ర‌యోగం విఫ‌ల‌మైన కార‌ణంగా ఎంత మంది మ‌ర‌ణించార‌న్న‌ది అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు.  మూర్ఖ‌త్వంతో సొంత న‌గ‌రాన్ని నాశ‌నం చేసుకున్న ఘ‌న‌త డిజిట‌ల్ యుగంలో కిమ్ కే ద‌క్కుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు