గ‌వ‌ర్న‌ర్ టీఆర్ఎస్ ఏజెంట్‌..ఆయ‌న్ను ఇక క‌లువం

గ‌వ‌ర్న‌ర్ టీఆర్ఎస్ ఏజెంట్‌..ఆయ‌న్ను ఇక క‌లువం

తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ విష‌యంలో కాంగ్రెస్ క‌న్నెర్ర చేసింది. గ‌వ‌ర్న‌ర్ తీరును నిర‌సిస్తూ ఇంకెప్పుడూ ఆయ‌న్ను క‌ల‌వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని, మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్‌కు శుక్రవారం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ వినతిపత్రం సమర్పించిన సమ‌యంలో జ‌రిగిన సంవాదంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ మల్లురవి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది.

ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయని, నేరెళ్ళ ఘటనకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆయన కొడుకు మంత్రి కె తారకరామారావు కారణమని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఆ ఘటనలో వారి పాత్ర ఏముందని గవర్నర్‌ ప్రశ్నించడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక వ్యాపారం కొత్తేమీ కాదని, గతంలోనూ జరిగినట్టే...ఇప్పుడూ జరుగుతున్నదని గవర్నర్‌ అనడంతో వారు మండిపడ్డారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఎలా వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. మందకృష్ణ దీక్ష చేస్తామంటే అక్రమంగా అరెస్టు చేసినా మీరు పట్టించుకోవడంలేదని విమర్శించారు. మందకృష్ణ దీక్షకు కూర్చోవడం సరైనది కాదని గవర్నర్‌ అనడంతో వాగ్వాదం పెరిగింది. సొంత కార్యాలయంలో కూడా దీక్ష చేసుకోవడానికి అవకాశం లేని పరిపాలనపై గవర్నర్‌ జోక్యం చేసుకోకుండా కేసీఆర్‌, కేటీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు చేశారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర గవర్నర్‌లా కాకుండా టీఆర్‌ఎస్‌ నేతలా వ్యవహరిస్తు న్నారని సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. మాల, మాదిగలంటే ఇంత చిన్న చూపు ఎందుకుని నిలదీశారు. సోనియాగాంధీ, మన్మోహన్‌సిం గ్‌ దయ వల్లే గవర్నర్‌ పదవి వచ్చిన విషయాన్ని మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి కలుగజేసుకుని పరిస్థితిని శాంతింప చేసినట్టు పార్టీ నేతలు చెప్పారు. ఇక ముందు మిమ్ముల్ని కలిసేది లేదని వారు తేల్చి చెప్పారు.

కాగా, ఇదే అంశంపై రాజ్‌భవన్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి. కాంగ్రెస్‌ నేతలతో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించాయి. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారని పేర్కొన్నాయి. రాజ్‌భవన్‌ తన గౌరవాన్ని కాపాడుకుంటూనే హుందాగా వ్యవహరిస్తుందని పేర్కొన్నాయి. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమాన్ని గవర్నర్‌ కాంక్షిస్తున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు స్పష్టం చేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English