కొత్త రూ.10 నోటు ఇదే..!

కొత్త రూ.10 నోటు ఇదే..!

నోట్ల రూపురేఖ‌ల్ని మార్చేస్తున్న కేంద్ర స‌ర్కారు.. ఒక్కొక్క నోటును మార్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపుగా అన్ని నోట్ల‌ను మారుస్తున్న కేంద్ర స‌ర్కారు రూ.10 నోట‌ను మారుస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. కొత్తగా ప్రింట్ చేస్తున్న నోట్ల క‌ల‌ర్స్ విష‌యంలో భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇప్ప‌టివ‌ర‌కూ వాడ‌ని రంగుల్ని వాడుతున్న వైనం తెలిసిందే.

తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన కొత్త రూ.10 నోట‌ను చాకోలెట్ క‌ల‌ర్ లో తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే కొత్త రూ.10 నోట్ల ప్రింటింగ్ షురూ అయిన‌ట్లుగా చెబుతున్నారు. చాకోలెట్ బ్రౌన్ క‌ల‌ర్ లో మ‌హాత్మాగాంధీ సీరిస్ లో ఉన్న ఈ నోట‌ను భార‌తీయ సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప్ర‌తిబింబించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. నోటు వెనుక కోణార్క్ సూర్య‌దేవాల‌యం.. మ‌హాత్మాగాంధీ చిత్రం.. అశోక్ స్తంభం..స్వ‌చ్ఛ‌భార‌త్ లోగో లాంటి ఫీచ‌ర్లు ఈ నోటు మీద ఉండ‌నున్నాయి.

కొత్త‌గా తెస్తున్న నోట్ల‌ను పొడుగు.. వెడ‌ల్పుల్ని త‌గ్గిస్తున్న చందంగానే రూ.10 నోట‌ను కూడా తగ్గించ‌నున్నారు. కొత్త పాత నోట్ల‌కు మ‌ధ్య సైజులు సంబంధం లేన‌ట్లుగా మారి.. ఇబ్బందిక‌రంగా మారాయి. ఇప్పుడు చ‌లామ‌ణిలో ఉన్న వంద నోటు కొత్త‌గా వ‌చ్చిన రూ.200 నోటు.. రూ.500 నోటు కంటే పెద్ద‌దిగా ఉండ‌టం.. ఆ నోట్ల మ‌ధ్య చిన్న‌దిగా ఉంటూ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో.. నోట్ల  మొత్తాన్ని మార్చేసే ప్ర‌క్రియ‌లో కేంద్రం ఉంది.

ప్ర‌స్తుతం మారుస్తున్న పాత రూ.10 నోటు డిజైన్ ను 2015లో చేశారు. కొత్త‌గా ముద్రిస్తున్న రూ.10 నోట‌ను ఒక బిలియ‌న్ నోట్ల‌ను అచ్చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. కొత్త నోటు డిజైన్ ను ప్ర‌భుత్వం వారం కింద‌టే ఆమోదించింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త నోట్లు చెలామ‌ణిలోకి వ‌చ్చేయ‌నున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు