ఆధార్ హ్యాకింగ్ సో ఈజీ : అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుడు

ఆధార్ హ్యాకింగ్ సో ఈజీ : అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుడు

బ‌తికినా..మ‌ర‌ణించినా స‌ర్వం ఆధార్‌మ‌య‌మైన ప్ర‌స్తుత త‌రుణంలో...ఈ వ్య‌క్తిగ‌త డాటా గోప్య‌త‌పై సందేహాలు ముసురుతున్నాయి. ఒక వివాదంపై స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా...మ‌రో వివాదం ముసురుతోంది. ది ట్రిబ్యూన్ దినపత్రిక నిర్వహించిన ఓ దర్యాప్తులో సదరు పత్రిక ప్రతినిధి పేటీఎం ద్వారా రూ.500 చెల్లించి వాట్సాప్‌పై ఆధార్ వివరాలను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే తమ ప్రతినిధికి అజ్ఞాత విక్రయదారుల నుంచి వాట్సాప్‌పై లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు వచ్చాయని, వీటి సాయంతో ఏ ఆధార్ నెంబర్‌నైనా ఎంటర్ చేస్తే చాలు ఆ నెంబర్‌కు సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫొటో, ఈ-మెయిల్ తదితర వివరాలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయని ది ట్రిబ్యూన్ వెల్లడించింది. ఈ ప‌రిణామం సృష్టించిన‌ క‌ల‌క‌లం స‌ద్ధుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రో వివాదం మొద‌లైంది.

ట్రిబ్యూన్ క‌థనంపై స్పందిస్తూ ఆధార్ వివరాలు అత్యంత భద్రంగానే ఉన్నాయని యూఐడీఏఐ స్పష్టం చేసింది. కేవలం రూ.500లకు వందకోట్ల మంది ఆధార్ వివరాల్ని కొందరు అజ్ఞాత వ్యక్తులు వాట్సాప్‌లో అమ్ముతున్నారంటూ వచ్చిన వార్తలు నిరాధార‌మ‌ని, బయోమెట్రిక్ సమాచారం సహా ఆధార్ డేటా వ్యవస్థ పూర్తిగా సురక్షితం అని ప్రకటించింది. కట్టుదిట్టమైన సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తున్నామని, డేటా అపహరణ అసాధ్యమన్నది. అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.

అయితే..ఆధార్ డేటాను హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ స్పష్టం చేసిన విషయంలో నిజం లేద‌ని మ‌రో నిపుణుడు స్ప‌ష్టం చేశారు. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను చోరీ చేయడం చాలా సులువైన పని అని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. `ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటా చోరీకి గురికావడం కామన్ విషయమే` అని ఆయ‌న వ్యాఖ్యానించారు.ఆధార్ డేటాను హ్యాక్ చేయడం సులువేనని కంప్యూట‌ర్ స్పెష‌లిస్ట్‌ స్నోడెన్ అన్నారు. కాగా, అమెరికా సెక్యూరిటీకి చెందిన అనేక రహస్య పత్రాలను బయటపెట్టిన స్నోడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. అదే స‌మ‌యంలో...ఆధార్ గోప్య‌త‌పై సందేహాలు ముసురుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు