గోదావరి జిల్లాల్లో పాకిస్థాన్ పందెంకోళ్లు?

గోదావరి జిల్లాల్లో పాకిస్థాన్ పందెంకోళ్లు?

సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో పందెంకోళ్లు ఉరకలేస్తున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారే ఈ వ్యవహారంలో కోడిపుంజుల సత్తాయే కీలకం కావడంతో ఇక్కడి పందేలా నిర్వాహకులు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా విదేశీ కోళ్లనూ దిగుమతి చేసుకుంటున్నారు. వాటిలో పాకిస్థాన్ నుంచి తెప్పించిన కోళ్లు కూడా ఉంటున్నాయని తెలుస్తోంది.

గోదావరి జిల్లాలు కోళ్ల పందేలాకు ఫేమస్ అయినట్లే పాకిస్థాన్లోనూ  సింధ్ ప్రాంతం కోడిపందేలకు ఫేమస్. అక్కడి ప్రజలు కోడిపందేలంటే పడి చస్తారు. ఇక్కడ కోడి పందేలా మాఫియా భారీ ఎత్తున ఉంది. పాక్‌లోని కరాచీ, రావల్పిండి వంటి నగరాల్లోనూ ప్రతి శుక్రవారం కోడిపందేలు జరుగుతుంటాయి. అసీల్ అనే ఒక రకమైన కోడిపుంజును ఎక్కువగా పందేళ్లో వినియోగిస్తుంటారు. దీంతో ఇప్పుడు గోదావరి పందెంరాయుళ్ల  కన్ను పాక్ కోళ్లపై పడిందంటున్నారు. ఇండోనేసియా, మలేసియా కోళ్లనూ తెప్పిస్తున్నారని సమాచారం.

గోదావరి జిల్లాల నుంచి గల్ఫ్‌కు మనుషులను పంపించే ఏజెంట్లలో చాలామంది ఇప్పుడీ పాకిస్థాన్ కోళ్ల దందాలో దిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇవి నిజంగా పాకిస్థాన్ బ్రీడ్ కోళ్లేనా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. కొందరు హైదరాబాద్ పాతబస్తీ నుంచి తెప్పించి పాక్  కోళ్లుగా ప్రచారం చేస్తున్నట్లు వినిపిస్తోంది. కొందరు మాత్రం ముంబయి, పంజాబ్ నుంచి వీటిని తెప్పిస్తున్నట్లు చెప్తున్నారు. పంజాబ్‌లోనూ అసీల్ బ్రీడ్ కోళ్లు దొరుకుతాయి కాబట్టి వాటినే తెప్పించి పాక్ కోళ్లుగా హడావుడి చేస్తున్నారని సమాచారం. అంతేకానీ, పాక్ నుంచి ఏపీకి కోళ్లను తెప్పించడం అంత సులభం కాదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు