బెల్లంకొండ బాబు తగ్గట్లేదుగా..

బెల్లంకొండ బాబు తగ్గట్లేదుగా..

పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా హిట్టు లేదు. అతడి తొలి సినిమా ‘అల్లుడు శీను’కు పాజిటివ్ టాకే వచ్చింది. దానికి వసూళ్లు కూడా పర్వాలేదు. ఇక అతడి లేటెస్ట్ మూవీ ‘జయ జానకి నాయక’కు కూడా మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలకూ భారీ బడ్జెట్ పెట్టడంతో పెట్టుబడి రికవర్ కాలేదు. కాస్ట్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. అయినప్పటికీ శ్రీనివాస్ తర్వాతి సినిమా విషయంలోనూ బడ్జెట్ పరంగా ఏమీ తగ్గుతున్నట్లుగా లేదు. శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీనివాస్ చేస్తున్న ‘సాక్ష్యం’ సినిమాకు కూడా ఖర్చు విషయంలో రాజీ లేనట్లే ఉంది.

కోటిన్నర దాకా పారితోషకం ఇచ్చి పూజా హెగ్డేను ఈ చిత్రంలో కథానాయికగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో పలు లొకేషన్లలో.. విదేశాల్లో భారీ ఖర్చుతో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇండియాలోనే టాప్.. హైయెస్ట్ పెయిడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన పీటర్ హెయిన్స్‌ ఈ చిత్రానికి యాక్షన్ సమకూరుస్తున్నాడట. అతను 60 రోజులుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడట. ఈ చిత్రంలో ఐదు యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయట. వాటికి భారీగా ఖర్చవుతుందట. ఇదంతా చూస్తుంటే సినిమాపై ఏ రేంజిలో ఖర్చు పెడుతున్నారో అర్థమవుతుంది. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఐతే పేరుకు అతను నిర్మాత అయినా.. చాలా వరకు పెట్టుబడి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేషే సమకూరుస్తున్నాడన్నది ఇన్ సైడ్ టాక్. ఇంతకుముందు ‘స్పీడున్నోడు’.. ‘జయ జానకి నాయక’ సినిమాల విషయంలోనూ ఇదే విధంగా జరిగిందని వార్తలొచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు