మాట మీద నిలడ్డ ట్రంప్‌..పాక్‌లో క‌ల‌వ‌రం

మాట మీద నిలడ్డ ట్రంప్‌..పాక్‌లో క‌ల‌వ‌రం

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణ‌యంపై క‌ట్టుబ‌డ్డారు. పాకిస్థాన్‌కు అందజేస్తున్న 25.5 కోట్ల డాలర్ల మిలిటరీ ఆర్థికసహాయాన్ని నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.నూతన సంవత్సరంలో మొదటి ట్వీట్ చేసిన ట్రంప్ పాక్ తీరును దుయ్యబట్టారు. పాకిస్థాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని అబద్ధాలు చెప్పి అమెరికా నుంచి నిధులు పొందిందని అయితే ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని మండిప‌డ్డారు. `పాక్ అబద్ధాలను గత 15 ఏళ్లుగా మా అమెరికన్లు ఎలా నమ్మారో అర్థంకావడం లేదు. నిధులు ఇస్తూనే పోయారు. ఇక దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే` అని ట్రంప్ పేర్కొన్నారు.

 ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న రోజుల్లో పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సహాయాన్ని నిలివేసే అవకాశముందని పలువురు భావించారు. అదే స‌మ‌యంలో ట్రంప్ ఆగ్ర‌హం నిజంగా ఆచ‌ర‌ణ రూపం దాల్చుతుందా అనే సందేహాలు వెలువ‌డ్డాయి. కానీ ట్రంప్ ఫైరింగ్ నిజ‌మ‌ని తేలింది.  ఈ విషయాన్ని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. తన భూభాగంపై పేట్రేగుతున్న ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిపైనే ఆర్థికసహాయం అంశం ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. త‌మ అధ్య‌క్షుడు చెప్పింది నిజం కానుంద‌ని చెప్పింది.

ఇదిలాఉండ‌గా...పాకిస్థాన్ అబద్ధాల కోరు, మోసకారి అని దుమ్మెత్తిపోసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాక్ ప్రతిస్పందించింది. తమ దేశంలోని అమెరికా రాయబారి డేవిడ్ హాలేను సోమవారం రాత్రి పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని విదేశాంగశాఖ కార్యదర్శి తెహ్మినా జాంజువా కోరారు. పాక్ అధికారులతో హాలే సమావేశమయ్యారని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి మంగళవారం ధ్రువీకరించారు.

మ‌రోవైపు పాకిస్థాన్‌కు సైనిక సాయం నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ దేశానికి షాక్‌ తగిలింది. ఈ విషయంపై చర్చించడానికి పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసి జాతీయ భద్రత కమిటీతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అబ్బాసి అధ్యక్షతన బుధవారం ఈ సమావేశం జరగనుంది. ట్రంప్‌ పాక్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందించాలనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పాక్‌ విదేశాంగ మంత్రి, అంతర్గత శాఖ మంత్రి, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, సివిల్‌, మిలిటరీ సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు