పార్టీ పేరేంటో...త‌న‌కు కూడా తెలియ‌దంటున్న ర‌జ‌నీ

పార్టీ పేరేంటో...త‌న‌కు కూడా తెలియ‌దంటున్న ర‌జ‌నీ

నూతన సంవత్సరానికి కొన్ని గంటల ముందు రాజకీయ పార్టీని ప్రకటించి, త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రింత దూకుడు పెంచారు. సోమవారం తన రాజకీయ పార్టీకి సంబంధించి అభిమానుల కోసం మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌, ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. త‌మిళనాడులో నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయ విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని రజనీకాంత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం వ్యవస్థలోని తప్పిదాలను సరి చేసేందుకు తాను స్థాపించే రాజకీయ పార్టీ సహాయకారిగా ఉంటుందని ర‌జ‌నీకాంత్ అన్నారు. `జాతీయోద్యమం నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పలు పోరాటాల్లో ముందు వరుసలో నిలిచింది. మరోసారి మనం అదే పరిస్థితిలో ఉన్నాం. రాజకీయ విప్లవం రావాల్సిన అవసరం ఉంది` అని అన్నారు. కొద్ది రోజులుగా సరైన దిశలో తన ప్రయాణం సాగుతున్నదన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

తాను సినీ రంగంలో అడుగు పెట్టకముందు కేవలం ఒక బస్ కండక్టర్‌గా పనిచేశానని అందరికీ తెలుసుగానీ, కొంతకాలం మీడియాలో కూడా పని చేశానని రజనీ చెప్పారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక కొన్ని నెలల పాటు ఒక మీడియా సంస్థలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశానని తెలిపారు. తాను మీడియాను వాడుకోలేదని రజనీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక రాజకీయాలంటే నిజాయితీతో కూడిన యదార్థమైన రాజకీయాలన్నారు. కుల, మత, విశ్వాసాలకు అతీతంగా పని చేయడమేనన్నారు. కాగా, రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటికీ పార్టీ పేరు, గుర్తును ఎప్పుడు ప్రకటిస్తారనేది స్పష్టం చేయలేదు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు బదులుగా.... 'పార్టీ పేరు ఏంటనేది నాకూ ఇంకా తెలియదు. ప్రజల్లోకి వెళ్తే తెలిసే అవకాశం ఉంది' అని సమాధానమిచ్చారు. ఒకేసారి నేను అన్ని విషయాలు చెప్పలేనన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు