ట్రంప్ మాట‌ల‌కు జిహాద్ ప్ర‌క‌టించిన పాక్ ఉగ్ర‌వాది

ట్రంప్ మాట‌ల‌కు జిహాద్ ప్ర‌క‌టించిన పాక్ ఉగ్ర‌వాది

పాక్ పచ్చి మోసకారి  అంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు అనూహ్య మ‌లుపు తిరిగాయి. అందుకు అగ్ర‌రాజ్యధిప‌తి కామెంట్ల‌కు కౌంటర్‌గా పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌ హఫీజ్‌ ఆ దేశంపై జిహాద్‌ ప్రకటించాడు. పాకిస్థాన్‌ ఇక అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. 26/11 ముంబయి ఉగ్రదాడి ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్‌ లాహోర్‌లో ర్యాలీ చేపట్టాడు. ఈ ర్యాలీలో అమెరికా, ఇజ్రాయిల్‌పై జిహాద్‌ ప్రకటించాడు.

నూతన సంవత్సరంలో మొదటి ట్వీట్ చేసిన ట్రంప్ పాక్ తీరును దుయ్యబట్టారు. పాక్ పచ్చి మోసకారని, గత 15 ఏళ్ల‌ నుంచి అబద్ధాలు చెప్పి అమెరికా నుంచి దాదాపు 3300 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని పొందిందని ట్రంప్ ధ్వజమెత్తిన సంగ‌తి తెలిసిందే. అమెరికన్లకు తెలివిలేదని పాకిస్థాన్ భావిస్తున్నదని, ఆ దేశం ఆటలు ఇక సాగవని చెప్పారు. `పాకిస్థాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని అబద్ధాలు చెప్పి అమెరికా నుంచి నిధులు పొందింది. కానీ, ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది. పాక్ అబద్ధాలను గత 15 ఏండ్లుగా మావాళ్లు(అమెరికన్లు) ఎలా నమ్మారో అర్థంకావడం లేదు. నిధులు ఇస్తూనే పోయారు. ఇక దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే` అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ట్రంప్ కామెంట్లు చేసిన మ‌రుస‌టి రోజే ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని హ‌ఫీజ్‌ చేపట్టారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలతోనే ఈ ర్యాలీ చేపట్టారన్నది బహిరంగ రహస్యమ‌ని అంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ ర్యాలీలో హఫీజ్‌తో పాటు, జమాత్‌-ఉద్‌-దవా నేత అబ్దుల్‌ రెహమాన్‌ కూడా పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో హ‌ఫీజ్ మాట్లాడుతూ `పాకిస్థాన్‌ అణ్వాయుధం ఇస్లాం ఆస్తి..జెరూసలెం విషయంలో దీన్ని ఉచితంగా వినియోగించవచ్చు. ఇది తన బహిరంగ ప్రకటన` అంటూ అమెరికాకు హెచ్చరికలు చేశాడు. ఇస్లామిక్‌ దేశాల చీఫ్‌లతో సదస్సు ఏర్పాటు చేసి జిహాద్‌ ప్రకటిస్తున్నాం అని వెల్లడించారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ ఉగ్ర‌వాద మూక ఐసిస్‌పై క‌న్నీరు కార్చాడు. రాను రాను ఐసిస్‌ ప్రభావం తగ్గిపోతూ వస్తోందని.. పవిత్ర యుద్ధం అంతానికి అమెరికా కుట్రలు చేస్తోందని సయీద్‌ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు.

కాగా, గత నవంబర్‌లో ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా అధిపతి హఫీజ్ సయీద్‌ను గృహనిర్భందం నుంచి పాక్ విడుదల చేయడంపైనా అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హఫీజ్‌ను మళ్లీ అరెస్టు చేయాలని, లేకుంటే ద్వైపాక్షిక సంబంధాలపై దీని ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇదిలాఉండ‌గా...రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న హఫీజ్‌ను పాక్‌ ఎప్పుడూ వెనుకేసుకొస్తోంది. అతడిని అరెస్టు చేయడంలోనూ జాప్యం చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English