జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన ర‌జ‌నీ

జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన ర‌జ‌నీ

తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ త‌న పొలిటిక‌ల్ కెరీర్‌ను అత్యంత ప‌క‌డ్బందీగా నిర్మించుకుంటున్నారు. సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం రజనీ కాంత్‌ ఇటీవల అభిమానులతో సమావేశమై చివరి రోజు తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అనంతరం అభిమానుల కోసం ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ ని ఒక్క దగ్గరికి చేర్చడంతో పాటు, వారి అభిప్రాయాలను తీసుకునేందుకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా చెన్నైలో మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.

మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ అనేక విష‌యాలు వెల్ల‌డించారు. తాను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని వెల్లడించారు. అయితే సినిమా రంగంలో బిజీ అయిపోయిన‌ని పేర్కొంటూ ప్రస్తుతం త‌నకు మీడియాను ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియడం లేదని వివరించారు. మీడియా వల్లే నేను ఇంతవాడిని అయ్యానని తెలిపారు. దీంతో పాటుగా రాజకీయాలకు తాను కొత్త కాబట్టి త‌న‌కు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాల‌ని రజనీకాంత్ కోరారు.

కాగా, రజినీ మండ్రం డాట్ ఓఆర్‌జీ పేరుతో సైట్ ను ప్రారంభించినట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అభిమానులెవరైనా ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని, వారి ఓటర్ ఐడీ నెంబర్ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందని రజినీ చెప్పారు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి పొలిటికల్ ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అభిమానులకు చేరవేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు