ప్ర‌పంచానికి వ‌ణుకు పుట్టించిన కిమ్ న్యూఇయ‌ర్ మాట‌

ప్ర‌పంచానికి వ‌ణుకు పుట్టించిన కిమ్ న్యూఇయ‌ర్ మాట‌

ఒక్క‌డు చాలు ప్ర‌పంచాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయ‌టానికి. ఈ మాట‌ను గ‌తంలో చెబితే న‌వ్వి పోయేవారు. మ‌రీ.. ఎక్కువ‌గా మాట్లాడుతున్న‌ట్లుగా భావించి న‌వ్వేవారు. కానీ.. కిమ్ పుణ్య‌మా అని.. ఒక మ‌నిషి కార‌ణంగా ప్ర‌పంచానికి ఇంత ప్ర‌మాదం పొంచి ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అధినేత‌ల విషెస్‌కు భిన్నంగా న్యూఇయ‌ర్ గ్రీటింగ్స్ చెప్పి వ‌ణుకు పుట్టించారు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్‌. శ‌త్రుదేశాల‌కు వార్నింగ్ ఇచ్చేలా ఆయ‌న తాజా సందేశం ఉన్న‌ప్ప‌టికీ.. శాంతికాముకుల‌కు మాత్రం కిమ్ మాట‌లు ఎంత‌కూ జీర్ణించుకోలేని రీతిలో ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏ శ‌క్తీ చేధించ‌లేని అణ్వ‌స్త్ర దేశంగా ఉత్త‌ర కొరియా మారాలంటూ పిలుపునిచ్చిన ఆయ‌న‌.. త‌న శ‌త్రు దేశాల‌కు సూటిగా వార్నింగ్ ఇచ్చేశారు.

త‌న టేబుల్ మీద ఎప్పుడూ ఒక బ‌ట‌న్ ఉంటుంద‌ని.. అది నొక్కితే అంతా బుగ్గిపాలేన‌న్న ఆయ‌న‌.. తాను చెబుతున్న‌ది న్యూక్లియ‌ర్ వెప‌న్ గురించ‌న్న విష‌యాన్ని చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూ వ్యాఖ్యానించారు. అణ్వ‌స్త్రాల త‌యారీని మ‌రింత పెంచి.. ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను పెద్ద ఎత్తున మొహ‌రించాల‌న్నారు.

ప్ర‌పంచంలో ఏ శ‌క్తీ త‌మ జోలికి రాకుండా చూసుకోవాల‌న్న కిమ్‌.. కొత్త సంవ‌త్స‌రంలోనూ త‌న విధ్వంస విధానాల్ని చెప్పుకునేందుకు ఏ మాత్రం సంకోచించ‌లేదు.

గ‌త ఏడాది అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌తో పాటు.. హైడ్రోజ‌న్ బాంబును కూడా ప‌రీక్షించిన కిమ్‌.. దారికి రాకుంటే యుద్ధం త‌ప్ప‌ద‌న్న అగ్ర‌రాజ్య హెచ్చ‌రిక‌ను పెడ‌చెవిన పెట్టి.. అమెరికా మాట‌ల‌కు మ‌రింత రెచ్చిపోయి అణ్వ‌స్త్రాల కుప్ప‌ను అంత‌కంత‌కూ పెంచుతున్న కిమ్.. తాజా మాట‌లు చూస్తే.. ఎప్పుడేం చేస్తాడోన‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం కావ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు