కోలీవుడ్ ఇప్పుడెన్ని ముక్క‌లు కానుంది?

కోలీవుడ్ ఇప్పుడెన్ని ముక్క‌లు కానుంది?

ద‌శాబ్దాల త‌ర‌బడి త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కు. ఆయ‌నే సూప‌ర్ స్టార్‌. ఆయ‌నున్నంత వ‌ర‌కూ ఆయ‌నే తిరుగులేని స్టార్‌. ఎవ‌రొచ్చినా.. ఎంత‌తోడు వ‌చ్చినా ఆయ‌న త‌ర్వాతే. ఇది కోలీవుడ్ లో కొన్నేళ్లుగా సాగుతున్న తీరు. దీనికి త‌గ్గ‌ట్లే.. అంద‌రివాడిగా వ్య‌వ‌హరిస్తూ.. వివాదాల‌కు అవ‌కాశం లేకుండా వెళుతున్న ర‌జ‌నీకాంత్ అంటే అంద‌రికి అభిమాన‌మే.

కోలీవుడ్ లో ప‌లువురు తార‌లు రాజ‌కీయాల‌కు సంబంధించి త‌మ త‌మ స్టాండ్ కు త‌గ్గ‌ట్లు ఉన్నా.. ర‌జ‌నీ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి అంద‌రికి కావాల్సిన‌వాడ‌న్న‌ట్లు ఉండేవారు. నేటి వ‌ర‌కూ అలాంటి ప‌రిస్థితే ఉంది. కానీ.. ఇప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే.. రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తానంటూ ర‌జ‌నీ నోటి నుంచి వ‌చ్చిన మాట త‌మిళ‌నాట ఇప్పుడు పెనుసంచ‌ల‌నంగా మారింది. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీతో ఈక్వేష‌న్లు పెద్ద ఎత్తున మార‌నున్నాయి. ఇంత‌కాలం అంద‌రివాడిగా ఉన్న ర‌జ‌నీ కొంద‌రివాడిగా మార‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. త‌మిళ సినిమా రంగానికి చెందిన న‌టులు ప‌లువురు రాజ‌కీయంగా వేర్వేరు స్టాండ్స్ తీసుకొని ఉన్నారు. మ‌రి.. అలాంటి వారు ఇప్పుడు అనివార్యంగా ర‌జ‌నీని త‌ప్పు ప‌ట్ట‌క త‌ప్ప‌దు.
ఇంత‌వ‌ర‌కూ త‌మకెంతో అరాధ్య‌నీయుడైన వ్య‌క్తిగా వ్యాఖ్య‌లు చేసిన వారు త‌న‌ను త‌ప్పు ప‌ట్టే విష‌యంలో ర‌జ‌నీ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
నేటి వ‌ర‌కూ ర‌జ‌నీకి వ్య‌తిరేకంగా కోలీవుడ్ లో మాట్లాడే వారే లేరు. మ‌రి..అలాంటిది తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పిన నేప‌థ్యంలో కోలీవుడ్ ఎన్ని ముక్క‌ల‌వుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద‌ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టికే కెప్టెన్ గా సుప‌రిచితులైన విజ‌య్ కాంత్ ఒక పార్టీకి అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినీ న‌టి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ సొంతంగా తాను పార్టీ పెట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి.. సాంకేతిక కార‌ణాల‌తో పోటీ నుంచి త‌ప్పుకోవాల్సిన వ‌చ్చిన హీరో విశాల్ రానున్న రోజుల్లో ఎలాంటి పొలిటిక‌ల్ స్టాండ్ తీసుకుంటార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇది స‌రిపోన‌ట్లుగా ఇప్పుడు ర‌జనీకాంత్ కూడా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌ట‌స్థంగా ఉన్న అజిత్‌.. సూర్య‌.. విక్ర‌మ్‌.. విజ‌య్ లాంటి న‌టులు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మారింది.

ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌పై గ‌తంలో లేని రీతిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే.. ఇంత‌కాలం త‌న‌ను నెత్తిన పెట్టుకొని చూసుకున్న వారంతా ఇప్పుడు ఛీద‌రించుకోవ‌టాన్ని ర‌జ‌నీ స్వీక‌రిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. మొత్తంగా చూస్తే.. నేటి వ‌ర‌కూ అంద‌రివాడిగా ఉన్న ర‌జ‌నీ రానున్న రోజుల్లో కొంద‌రివాడు అవుతాడ‌న‌టంలో సందేహం లేదు. అదెలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌న్నది ఇప్పుడు అంచ‌నాల‌కు అంద‌నట్లుగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు