హైద‌రాబాద్ మెట్రో..అర‌గంట ఆగిపోయింది!

హైద‌రాబాద్ మెట్రో..అర‌గంట ఆగిపోయింది!

హైదరాబాద్ మెట్రోలో తొలిసారి అవాంతరం తలెత్తింది. మెట్రో రైల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో...అరగంట పాటు నిలిచిపోయింది. నాగోల్ నుంచి మెట్టుగూడ వెళ్తున్న మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 30 నిమిషాల పాటు నిరీక్షించాల్సి వ‌చ్చింది. దీంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు.

ఆదివారం ఉద‌యం స‌మ‌యంలో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. బేగంపేట‌ ప్రకాష్ నగర్ పాకెట్ సైడ్ స్టేషన్ కు అమీర్ పేట్ నుంచి టెక్నికల్ సమస్య వున్న ట్రైన్‌ను తరలించడం ఆలస్యం అవుతుండటంతో  మెట్టు గూడ లో ట్రైన్ అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్ కు రాలేక పోయింద‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివ‌రించారు. అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ స్టేషన్లో ఉన్న మెట్రో ట్రైన్ లో కొంత సాంకేతిక సమస్య  ఉండటం వల్ల మెట్టుగూడలో ట్రైన్ నిలిపామ‌ని ఆయ‌న వివ‌రించారు. దాదాపు అర‌గంట త‌ర్వాత ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కరించామ‌ని ఆయ‌న తెలిపారు.

ఇదిలాఉండ‌గా....శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రోరైలు విస్తరించనుంది. నగరంలోని రెండు మార్గాల్లో ఈ రైలును విమానాశ్రయం వరకు విస్తరించేందుకు ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వం ముందు ఉంచినట్టు తెలిసింది. ఎల్బీనగర్ నుంచి కర్మన్‌ఘాట్ మీదుగా శంషాబాద్‌కు చేరేలా ఒక మార్గం, మరొక మార్గం హైటెక్‌సిటీ నుంచి కిస్మత్‌పుర మీదుగా శంషాబాద్‌కు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఇందులో ఏదో ఒక మార్గాన్ని ఖరారు చేసి మరో మార్గాన్ని ప్రతిపాదనల నుంచి తొలిగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు (7 కిలోమీటర్లు) విస్తరణతోపాటు మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు(13 కి.మీటర్లు) కలుపుకొని మొత్తం 83 కిలోమీటర్ల మార్గాన్ని రెండోదశలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది.

2018లో మొదటిదశలోని మూడు కారిడార్ల పనులన్నీ పూర్తై ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుండటంతో నగర ప్రజల డిమాండ్ మేరకు మెట్రోరైలును ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. తాజా మార్గం ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై అధ్యయనం చేయడానికి కొద్ది నెలల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సహా ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. మెట్రో విస్తరణ ఉంటుందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కూడా కొద్ది రోజుల కిందట వెల్లడించారు. మెట్రోరైలు విస్తరణపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు విస్తరణ అంశం ప్రతిపాదన దశలో ఉందని తెలిపారు. ఈ విషయం ప్రభుత్వ పరిధిలో ఉన్నదన్నారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం, విధివిధానాలు ప్రభుత్వమే నిర్ణయించి ప్రకటిస్తుందని చెప్పారు. పీపీపీ విధానంలోనా? ప్రభుత్వ నిధులతో నిర్మిస్తాఅన్న ప్రశ్నకు ప్రభుత్వమే ఈ విషయంపై నిర్ణయం తెలియచేస్తుందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు