రాజకీయాల్లోకి వస్తున్నా.. కొత్త పార్టీ స్థాపిస్తా: రజనీ

రాజకీయాల్లోకి వస్తున్నా.. కొత్త పార్టీ స్థాపిస్తా: రజనీ

ఊహాగానాలకు తెరపడింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వ‌చ్చేసింది. తన అభిమాన కథానాయకుడి రాజకీయ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పడింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవలి కాలంలో అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇవాళ ప్రకటిస్తానన్న విషయం తెలిసిందే. ఇంటి నుంచి అభిమానులతో భేటీ అయ్యే ప్రదేశమైన‌ శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు సైతం మీడియా ఆయనను పలకరించినా స్పందించలేదు. సభా స్థలికి చేరుకున్న అనంతరం అభిమానులతో భేటీ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ..దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. రాజకీయ మార్పు కోసం సమయం ఆసన్నమైందని తెలిపారు. పదవి, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. తమిళ ప్రజల మద్దతు ఉంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు సాధ్యమనన్నారు. ప్రజల ఆదరణ, దేవుని కటాక్షం తనకున్నాయని నమ్ముతున్నట్లు ర‌జ‌నీ ధీమా వ్య‌క్తం చేశారు.

`గతంలో వలస పాలకులు మన దేశాన్ని కొల్లగొట్టారు. కానీ ఇప్పుడు మన పాలకులే ప్రజాస్వామ్యం పేరుతో మనల్ని కొల్లగొడుతున్నారు` అని ర‌జ‌నీ మండిప‌డ్డారు. రానున్న శాసనసభ ఎన్నికల్లోపే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు తెలిపారు. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రజనీ రాజకీయ ప్రవేశంతో అభిమానుల ఆనందంలో మునిగారు. ఉత్కంఠ అనంత‌రం ర‌జ‌నీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సై అనడంతో అభిమానుల్లో జోష్‌ నింపినట్లయింది. రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు