గుజ‌రాత్ స‌ర్కారులో చీలిక‌...బీజేపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై?!

గుజ‌రాత్ స‌ర్కారులో చీలిక‌...బీజేపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై?!

గ‌ట్టి పోటీ ఎదుర్కున్న అనంత‌రం గుజరాత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీకి మ‌రో అనూహ్య‌మైన ప‌రీక్ష ఎదుర‌వుతోంది. గుజ‌రాత్‌లో కొత్త  కొలువుదీరి వారం రోజులు కూడా గడవలేదు. అప్పుడే అసమ్మతి రాగం మొదలైంది. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఏకంగా రాజీనామా చేసేందుకు ఉప ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

గుజ‌రాత్ సీఎం రూపానీ గౌరవం ఇవ్వడం లేదని నితిన్ తన సహచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను నితిన్‌పటేల్ నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్‌కు కేటాయించారు. మిగతా రెండు శాఖలను సీఎం రూపానీ తన వద్దే ఉంచుకున్నారు. ఇక నితిన్ పటేల్‌కు రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య శాఖలను కేటాయించడంతో.. ఆయన అలక వహించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన మూడు శాఖలను మూడు రోజుల్లో తనకు తిరిగి ఇవ్వకపోతే రాజీనామా చేసేందుకు నితిన్ పటేల్ సిద్ధపడినట్లు సమాచారం.

తాజాగా రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. డిప్యూటీ సీఎం పటేల్ మాత్రం సచివాలయానికి దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. ఈ అంశంపై పటేళ్ల ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ స్పందించారు. బీజేపీని వీడేందుకు నితిన్ పటేల్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయన వెంబడి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెప్పారు. ఒక వేళ బీజేపీ నితిన్ పటేల్‌కు సముచిత గౌరవం ఇవ్వకపోతే ఆయన తప్పకుండా బీజేపీని వీడుతారని పేర్కొన్నారు. నితిన్ కాంగ్రెస్‌లో చేరితే మంచి స్థానం తప్పక లభిస్తుందని హార్ధిక్ పటేల్ అంచ‌నా వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు