క్రిస్మ‌స్ రోజు పాఠాలా... శ్రీ‌చైత‌న్య‌లో హాస్ట‌ల్ విద్యార్థుల తిరుగుబాటు

క్రిస్మ‌స్ రోజు పాఠాలా... శ్రీ‌చైత‌న్య‌లో హాస్ట‌ల్ విద్యార్థుల తిరుగుబాటు

పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పాలి. చ‌దువు మీద ఇష్టం పెరిగేలా చేయాలే త‌ప్పించి.. అదిలించి.. బెదిరిస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాదాపూర్ శ్రీ‌చైత‌న్య క్యాంపస్ లో యాజ‌మాన్యం తీరుకు విద్యార్థులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

పండ‌గ సెలవుల్లో ఇంట‌ర్ క్లాస్ లు పెడుతున్న కాలేజీ తీరును ప్ర‌శ్నించిన విద్యార్థుల్ని డార్క్ రూముల‌లో పెట్టి కొట్ట‌టంతో విద్యార్థుల్లో స‌హ‌నం న‌శించి.. ఊహించ‌ని రీతిలో విధ్వంసం సృష్టించిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ర‌స్వ‌తి బాయిస్ హాస్ట‌ల్ లో ఉన్న 450 మంది విద్యార్థులు ఏక‌మై.. హాస్ట‌ల్ లోని ఫ‌ర్నీచ‌ర్‌.. ఏసీలు.. కుర్చీలు.. ఫ్యాన్లు.. పూల‌కుండీలు.. టాయ్ లెట్ సీట్ల‌తో  పాటు.. కిటికీ అద్దాల్ని ధ్వంసం చేశారు.

ప్ర‌భుత్వ సెల‌వైన క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం రోజు ఇంటికి పంప‌కుండా త‌ర‌గతుల‌ను నిర్వ‌హించ‌ట‌మే కాదు.. మార్కులు.. ర్యాంకుల పేరుతో శారీర‌కంగా.. మాన‌సికంగా చేస్తున్న హింసై వారు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ‌కు క‌నీస స్వేచ్ఛ‌ను కూడా లేకుండా చేస్తున్నార‌ని వాపోతున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. క్లాస్ రూమ్ లో కొడుతున్నార‌ని.. కొట్టేట‌ప్పుడు ఎదురు తిరిగితే.. విడిగా పిలిచి డార్క్ రూమ్ ల‌లో ప‌డేసి త‌మ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లుగా వారో ఆరోపిస్తున్నారు. ఈ చిత్ర‌హింస‌ల‌కు త‌ట్టుకోలేని విద్యార్థులు ఒక్క‌సారిగా తిర‌గ‌బ‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా ఉండ‌గా.. మంచి చెడ్డ‌లు చెప్పాల్సిన హాస్ట‌ల్ వార్డెన్ తోపాటు కొంద‌రు ఉపాధ్యాయులు మందు కొట్టి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ చ‌ద‌వాల‌ని కొడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. ల‌క్ష‌ల రూపాయిల్లో ఫీజులు వ‌సూలు చేస్తూ.. కంపు కొడుతున్న భోజ‌నం.. నీళ్ల చారుతో క‌డుపు నింపుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ కష్టాల గురించి పేరెంట్స్‌కు చెబితే క్లాస్ రూంలో కొడుతున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు.

 ఇదిలా ఉండ‌గా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స్టూడెంట్స్ ను ఆదివారాల్లో.. పండుగ సెల‌వుల్లో ఇంటికి పంప‌టం లేద‌ని చెబుతున‌నారు. నిబంధ‌న‌ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. పిల్ల‌ల్ని అకార‌ణంగా కొడుతున్న వైనంపై ప్ర‌భుత్వం స్పందించాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు