ప్ర‌తీకారం కోసం పీవోకేలోకి వెళ్లిన భార‌త ఆర్మీ

ప్ర‌తీకారం కోసం పీవోకేలోకి వెళ్లిన భార‌త ఆర్మీ

గ‌తానికి భిన్న‌మైన ప‌రిస్థితులు స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్నాయి. దాయాది పాక్ చేస్తున్న దుర్మార్గాల‌కు ధీటుగా బదులిచ్చేలా భార‌త సైన్యం వ్య‌వ‌హ‌రిస్తోంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అదే ప‌నిగా ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే షాకిచ్చింది భార‌త సైన్యం. అదే ప‌నిగా స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్న పాక్  కు త‌న తాజా తీరుతో భారీ హెచ్చ‌రిక‌ను ఇచ్చింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అదే పనిగా ఉల్లంఘిస్తూ భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా సిబ్బందిపై పాక్ సైనికులు జ‌రుపుతున్న కాల్పుల‌కు ధీటుగా బ‌దులిచ్చింది భార‌త సైన్యం. ఇటీవ‌ల జ‌రుపుతున్న అక్ర‌మ కాల్పుల కార‌ణంగా భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. శ‌నివారం ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించిన తీరుతో న‌లుగురు జ‌వాన్లు మృతి చెందారు.

దీంతో.. భార‌త సైన్యం ప్రతీకారం తీర్చుకునే ప్ర‌య‌త్నం చేసింది. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ను దాటి మ‌రీ.. దూసుకెళ్లిన భార‌త సైన్యం.. పాక్ సైనికుల మీద కాల్పుల జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా పాక్ సైనికులు ముగ్గురు మృతి చెందిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘ‌ట‌న‌ను పాక్ మిలిట‌రీ మీడియా త‌న‌దైన వాద‌న‌ను వినిపించింది. రావ్లాకోట్ లోని రూఖ్ చ‌క్రీ సెక్టార్ వ‌ద్ద భార‌త సైనికులు రెచ్చ‌గొట్టేలా కాల్పులు ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లుగా పేర్కొంది. ఈ సంద‌ర్భంగా తాము ధీటైన స‌మాధానం ఇచ్చిన‌ట్లుగా క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఇదిలా ఉంటే..  అస‌లు జ‌రిగిందేమిట‌న్న‌ది చూస్తే.. అక్ర‌మ కాల్పుల‌తో భార‌త సైనికుల ప్రాణాలు తీసిన దుర్మార్గానికి ధీటైన స‌మాధానం చెప్పేందుకు భార‌త ఆర్మీ సిబ్బంది నియంత్ర‌ణ రేఖ‌ను దాటి పాక్ రేంజ‌ర్స్ పై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో పాక్‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లుగా తెలుస్తోంది.

భార‌త్ - పాక్ ల మ‌ధ్య కాల్పుల ఒప్పందం 2003లో జ‌రిగింది. ఈ ఒప్పందం ప్ర‌కారం ఇరు దేశాల మ‌ధ్య‌నున్న అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు నియంత్ర‌ణ రేఖ వెంట సైనికులు ఒక‌రిపై ఒక‌రు కాల్పుల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. కానీ..దాయాది పాక్ తొండాట కార‌ణంగా అప్పుడ‌ప్పుడు భార‌త సైనికుల్ని క‌వ్వించే నెపంతో కాల్పుల‌కు తెగ బ‌డుతుంటారు. ఒప్పందం నాటి నుంచి ఈ డిసెంబ‌రు 10 వ‌ర‌కు దాదాపు 881 సార్లు పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే.. ఖండ‌న‌లు చేయ‌టం.. పాక్ తీరును త‌ప్పు ప‌ట్ట‌టం లాంటి మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. మోడీ స‌ర్కారు ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం పాక్ దుర్మార్గాల‌కు స‌రైన రీతిలో బ‌దులిస్తున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ మ‌ధ్య‌న చేప‌ట్టిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కూడా పాక్‌కు బుద్ధి చెప్పేందుకేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.