తెలంగాణ‌లో ఇంకో యూనివ‌ర్సిటీలో ఉద్రిక్త‌త‌

తెలంగాణ‌లో ఇంకో యూనివ‌ర్సిటీలో ఉద్రిక్త‌త‌

తెలంగాణలో మ‌రో యూనివ‌ర్సిటీలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏకంగా రాళ్లు రువ్వుకునే ప‌రిస్థితి ఎదురైంది. దీంతో ఏకంగా హాస్ట‌ల్ మూసివేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వర్గం విద్యార్థులు మనుధర్మం పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీన్ని మరో వర్గం అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. ఈ గొడవ పెద్దదై ఇరు వర్గాల మధ్య రాళ్లదాడికి దారి తీసింది.

యూనివర్శిటీలో మనుస్మృతిని కొంతమంది తగలబెట్టారన్న విషయంపై ఏబీవీపీ, బహుజన విద్యార్థి సంఘాల మధ్య వివాదం తలెత్తింది. రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్నాయి. దాడులు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో శాతవాహన యూనివర్సిటీకి పోలీసులు చేరుకున్నారు. దాడులకు పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.రేప‌టి నుంచి క‌రీంన‌గ‌ర్ శాత‌వాహ‌న వ‌ర్సిటీ హాస్ట‌ల్ మూసివేసిన‌ట్లు రిజిస్ర్టార్ ప్ర‌క‌టించారు. వ‌ర్సిటీ విద్యార్ధులు త‌క్ష‌ణ‌మే హాస్ట‌ళ్లు ఖాళీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్లు రిజిస్ర్టార్ తెలిపారు.

కాగా, శాతావ‌హ‌న యూనివిర్సిటీలో ప‌రిణామాల‌పై ప్ర‌భుత్వం ఆరా తీసిన‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు ఇంటెలిజెన్స్ రిపోర్టును సైతం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓయూలో విద్యార్థుల మ‌ధ్య  విబేధాలు ఉన్న నేప‌థ్యంలో శాత‌వాహ‌న‌ యూనివ‌ర్సిటీ కూడా ఆ జాబితాలో చేర‌డం ప‌ట్ల ఆందోళ‌న‌లు రేకెత్తుతున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు