సీఎంను ఇలా అవ‌మానించ‌డం ఏంటి మోడీజీ?

సీఎంను ఇలా అవ‌మానించ‌డం ఏంటి మోడీజీ?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ముఖ్య‌మంత్రిని అవ‌మానించారా? త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అనే కోణంలో ఆయ‌న ఈ విధంగా వ్య‌వ‌హ‌రించారా? అంటే అవుననే స‌మాధానం బీజేపీ అధికారుల నుంచి వినిపిస్తోంది. ఢిల్లీలో మెజెంటా మెట్రో లైన్‌ను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించి, కొంతదూరం ప్రయాణించారు.అయితే ఢిల్లీలో మెట్రో కొత్త లైన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్‌ వరకు ఈ లైన్‌ అందుబాటులోకి వచ్చింది. 12న్నర కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం.. ఢిల్లీని నోయిడాతో కలుపుతుంది. మెట్రో మెజెంటా లైన్‌ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం ఖట్టర్‌ పాల్గొన్నారు. అయితే అత్యంత ఆస‌క్తిక‌రంగా ఢిల్లీ సీఎం గైర్హాజ‌రు అయ్యారు. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్‌ను పిలవలేదని విమర్శించారు. ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేసింది.

ఇదిలాఉండ‌గా....ఇటీవ‌లే ఈ మెట్రో రైలు లైనుకు పెను ప్రమాదం తప్పింది. ప్రారంభోత్సవం సందర్భంగా గ‌త‌ మంగళవారం ఉదయం మెట్రో రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు కలింది కుంజ్ డిపో వద్ద మెట్రో రైలు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఆటోమేటిక్ బ్రేక్‌లు ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైలులోని రెండు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రోవైపు ఈ ఏడాది ప్రారంభమైన మెట్రో రైళ్లలో ఇది మూడోది. జూన్‌లో కొచ్చి మెట్రోను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. నవంబర్‌లో హైదరాబాద్‌ మెట్రోను ప్రారంభించారు. ఈ రోజు మెజెంటా మెట్రోను ప్రారంభించారు.