ఇదిగో ఆధారం...ఏలియ‌న్స్ వ‌చ్చేశారు

ఇదిగో ఆధారం...ఏలియ‌న్స్ వ‌చ్చేశారు

ఇదిగో గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చారు.. సాసర్ ఆకారంలో ఉండే వారి అంతరిక్ష నౌకలో ఏలియన్స్ అమెరికాలో దిగారు...ఆ ఏలియన్స్ నౌక ఉత్తర కొరియా మీదుగా అమెరికాకు వచ్చింది...శుక్రవారం సాయంత్రం అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వార్తలివి. దాదాపు కొన్ని గంట‌ల పాటు క‌ల‌క‌లానికి గురిచేసిన అంవాలి.

అమెరిక‌న్ కాల‌మానం ప్ర‌కారం శుక్రవారం సాయంత్రం లాస్‌ఏంజిల్స్‌పై ఆకాశంలో భారీ చేప ఆకారంలో తెల్లని కాంతి కనిపించింది. కాలిఫోర్నియా మీదుగా వచ్చిన ఈ కాంతిని చూసి స్థానికులు గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకగా భావించి, దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. రోడ్లపై వాహనాలను నిలిపేసి ఫొటోలు, వీడియోలు తీశారు. చాలా మంది అత్యవసర సేవల నంబర్ 911కు ఫోన్ చేసి సాయం అడిగారు. లాస్‌ఏంజిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి ఏకంగా 130 మంది ఫోన్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు టీవీ చానళ్లకు ఫోన్ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ కాంతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో నిమిషాల్లో వైరలయ్యాయి.

ఏలియన్స్ భూమి మీద దిగారని ఒకరు.. యూఎఫ్‌వోను చూశామని మరొకరు కామెంట్లు పెట్టారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ టెల్సా సీఈవో ఎలోన్ మస్క్ ఏకంగా అది ఉత్తర కొరియా నుంచి వచ్చిందని ట్వీట్ చేయడం మరింత సంచలనమైంది. ఈ వార్తలకు చెక్ పెట్టిన స్పేస్ ఎక్స్.. అది తాము ప్రయోగించిన పునర్వినియోగ రాకెట్ అని ప్రకటించింది. కాలిఫోర్నియాలోని వడెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా 10 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించామని వివ‌రించారు. దీంతో గంట‌ల కొద్ది క‌లవ‌రానికి బ్రేక్ ప‌డింది.