పవన్, కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారు?

పవన్, కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారు?

ఫాలోయింగ్‌లో ఇద్దరూ ఇద్దరే. పట్టుదలలోనూ ఇద్దరూ ఇద్దరే. రాజకీయాల్లో పండిపోయినవారు ఒకరైతే.. ఇప్పుడిప్పుడే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నది ఇంకొకరు. వారిద్దరూ ఒకరేమో కేసీఆర్, ఇంకొకరు పవన్ కల్యాణ్. మొన్ననే ఇద్దరికీ చిన్నపాటి పరోక్ష ఘర్షణ తలెత్తింది. ఆత్మహత్య  చేసుకున్న ఉస్మానియా విద్యార్థి మురళి ఇంటికి వెళ్లి పరామర్శించడానికి పవన్ సిద్ధమయ్యాడు.. కేసీఆర్ తెలివిగా సెక్యూరిటీ కల్పించలేమన్నాడు. పవన్ సైలెంటయిపోయాడు. ఏపీ కేంద్రంగా రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పవన్ తెలంగాణలో వేలు  పెట్టే ఉద్దేశంలో లేనప్పటికీ కేసీఆర్ మాత్రం ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వరాదన్న ఉద్దేశంతో ఆదిలోనే కట్ చేశారు. అయితే.. ఇప్పుడా ఇద్దరు ఒకే కార్యక్రమంలో కలుసుకున్నారు. అంతేకాదు, కాసేపు ముచ్చటించుకున్నారు కూడా.

శీతాకాల విడిది కోసం భాగ్య‌న‌గ‌రానికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దంప‌తులకు గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన విందులో పవన్, కేసీఆర్ లు మాట్లాడుకున్నారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోపాటు, మెగాస్టార్ చిరంజీవి, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌ముఖులు, వివిధ రంగాల ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్, చంద్ర‌బాబు మాటా మంతి ముగిసిన త‌రువాత కేసీఆర్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రికొక‌రు ప‌ల‌క‌రించుకుని కాసేపు ముచ్చ‌టించారు.

మరోవైపు అన్నదమ్ములు చిరు, పవన్‌లు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. కేసీఆర్‌ను చిరంజీవి కూడా కలిశారు. వారిద్దరు మాట్లాడుకున్నారు. ఆ తరువాత చంద్రబాబును చిరు కలిశారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో కేసీఆర్ వారితో జాయిన్ అయ్యారు.

చిరు, చంద్రబాబు, కేసీఆర్‌లు ఎవరు ఎవరిని కలిశారన్నది పెద్ద విశేషం కాకపోయినా కేసీఆర్, పవన్ ల ముచ్చట్లే అందరికీ హాట్ టాపిగ్గా మారాయి. నిజానికి కేసీఆర్, పవన్‌లు చాలాకాలంగా భిన్న ధ్రువాలుగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పటి నుంచి ఇద్దరి మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. గ‌త ఎన్నిక‌ల ప్రచారంలో కూడా కేసీఆర్.. ప‌వ‌న్‌ను తాను అస్సలు ప‌ట్టించుకోన‌ని తీసి పడేశారు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికలప్పుడు కూడా ఏపీలో పవన్ పోటీ చేస్తే ఆయన పార్టీకి 1 శాతం ఓట్లు కూడా రావ‌ని ఏకిపడేశారు. కేసీఆర్ ప‌లు వ్యాఖ్యల‌పై ప‌వ‌న్ నేరుగానో, లేదా సోష‌ల్ మీడియా ద్వారానో కౌంట‌ర్లు వేసిన సందర్భాలున్నాయి. మొన్న ఉస్మానియా పర్యటనకూ పవన్ ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఇలా... కేసీఆర్, పవన్‌ల మధ్య అయితే ఘర్షణే ఉంది. ఇలాంటి తరుణంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకున్నారా... లేదంటే ప‌ర్సన‌ల్ విష‌యాలతో సరిపెట్టారా అన్నది తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు