దయనీయంగా బీజేపీ పరిస్థితి

దయనీయంగా బీజేపీ పరిస్థితి

మొన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి దేశంలో మొత్తం 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న రికార్డు అందుకుని బాహుబలిగా మారిన భారతీయ జనతా పార్టీ తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో మాత్రం నెత్తిన రుమాలేసుకుంది. తమిళనాడులో, అందులోనూ ఆర్కేనగర్‌లో బీజేపీ గెలిచేస్తుందని ఎవరూ అనుకోరు కానీ... కనీసం ఒక వెయ్యి ఓట్లయినా వస్తాయని అనుకుంటారు. కానీ... ఇప్పటివరకు జరిగిన లెక్కింపు చూస్తే బీజేపీకి 100 ఓట్లు కూడా వస్తాయో రాదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీకి నోటా  కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.

ఇక్కడ శశికళ వర్గం ఎమ్మెల్యే దినకరన్ ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో దినకరన్ 10 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో కొనసాగుతున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న దినకరన్ కడపటి వార్తలందే సరికి సమీప ప్రత్యర్థి, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కంటే దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మూడో స్థానంలో డీఎం కే అభ్యర్థి ఉండగా, బీజేపీ చివరి స్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థికి ఇప్పటి వరకూ కేవలం 66 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నోటాకు 102 ఓట్లు పడగా, బీజేపీ అభ్యర్థికి కేవలం 66 ఓట్లు రావడం తమిళనాడ చర్చగా మారింది.

మరోవైపు అన్నాడీఎంకే, దినకరన్ వర్గం కార్యకర్తల మధ్య ఘర్షణ కారణంగా కొద్దిసేపు నిలిచిపోయిన కౌంటింగు తిరిగి ప్రారంభమైది. అన్నాడీఎంకే కార్యకర్తలు దినకరన్ వర్గీయులపై దాడి చేయడంతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల వారూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో రంగంలోనికి దిగిన పారా మిలిటరీ బలగాలు పరిస్థితిని అదుపు చేశాయి. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గుమిగూడిన ఇరు వర్గాల వారినీ చెదరగొట్టారు. అనంతరం ఓట్ల లెక్కింపు తిరిగి ప్రారంభమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు