సిలికాన్ కారిడార్‌..మంత్రి లోకేష్ కొత్త డ్రీం

సిలికాన్ కారిడార్‌..మంత్రి లోకేష్ కొత్త డ్రీం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొత్త ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక రాజ‌ధాని విశాఖ‌ను ఫిన్‌టెక్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేష్ మరోవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల‌పై దృష్టి సారించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో వివ‌రించారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తో కలిసి సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ)పై సీఎం చంద్ర‌బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సిలికాన్ కారిడార్ పేరుతో త‌న కొత్త డ్రీం ప్రాజెక్టు వివ‌రాల‌ను మంత్రి లోకేష్ వెల్ల‌డించారు.

తన అమెరికా పర్యటనలో విశాఖలో సెంటర్ ఏర్పాటు చేసేలా గూగుల్ ఎక్స్‌తో ఎంవోయూ చేసుకున్నామని మంత్రి లోకేష్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. తిరుపతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహో జనవరిలో ఇక్కడ ప్రారంభం కానుందని తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌తో సంప్రదింపులు జరిపామని, విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకారం తెలిపిందని వెల్లడించారు.  ఎలక్ట్రానిక్ పరిశ్రమల్ని పెద్దఎత్తున ఆకర్షిస్తున్నామని వెల్ల‌డించారు. సిలికాన్ కారిడార్ పేరుతో ఎలక్ట్రానిక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్ల‌డించారు. రానున్న భాగస్వామ్య సదస్సులో పెద్దఎత్తున ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రాష్ట్రంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సిలికాన్ కారిడార్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంద‌ని వివ‌రించారు. ఇప్పటికే తమిళనాడులో తమ యూనిట్ నెలకొల్పిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ప్లెక్స్‌ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ వివరించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, రోబో టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రూపొందించుకోవాల్సి ఉందని ఐటీ శాఖ అధికారులకు సూచించారు.  రాష్ట్రం ఐటీ, ఐవోటీకి ప్రాధాన్యత ఇస్తున్నందున అంతర్జాతీయ సంస్థలు మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయ‌న విశ్లేషించారు. ఇటీవ‌లే ఫిన్‌టెక్, అగ్రిటెక్, ఎడ్యుకేషన్ ఈవెంట్లు విజయవంతం చేశామని, ప్రతినెలా ఏదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ‘లీక్వాన్ యూనివర్సిటీ’ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో ఎప్పటికప్పుడు నూతనత్వం ఉండాలని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఐటీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. అగ్రికల్చర్, మెడికల్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ ఐటీని తప్పనిసరి చేయాలని నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు